అగ్రిగోల్డ్ బాధితులకు జగన్‌ సర్కార్ అండ!

Fulfilling Promise, CM YS Jagan To Distribute Money to Agrigold Victims Tomorrow - Sakshi

రేపు గుంటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా బాధితులకు చెల్లింపులు

రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు

తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ సమస్యపై నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయింపు

గత నెల 18న రూ. 263.99 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

రాష్ట్రంలోని 3,69,655 మంది మందికి ఊరట

సాక్షి, అమరావతి:  అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. ఐదేళ్ల పోరాటంలో అడుగడుగునా దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేసింది. గుంటూరులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా గురువారం (7వ తేదీ) డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గట్టెక్కించడానికి.. నేనున్నానంటూ ఆనాడు ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా నేడు బాధితులకు అండగా నిలుస్తోంది.

నమ్మించిన సంస్థ నట్టేటముంచింది. ఆదుకోవాల్సిన సర్కార్‌ అక్రమాలకు తెగబడింది. రోజువారీ కష్టం చేసుకునేవారి నుంచి, చిన్నా, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించిన అగ్రిగోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వారి నుంచి 6,380 కోట్ల రూపాయలను సేకరించింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, పటిష్టమైన ఏజెంట్ల వ్యవస్థతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకట రామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ అనతికాలంలోనే వేలకోట్ల రూపాయలను ప్రజలనుంచి సేకరించి, పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంలలో సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిట్‌దారులు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతోపాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవుల నుంచి మధ్యతరగతి మహిళలు పొదుపుగా దాచుకున్న మొత్తాల వరకు డిపాజిట్ల రూపంలో అగ్రిగోల్డ్‌కు చేరాయి.

ఆస్తులను మింగేందుకు గత సర్కార్ కుట్రలు..
అవసరానికి ఆదుకుంటాయని భావించిన సొమ్ము కాస్తా.. తిరిగి రాదని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ నుంచి స్పందన లేకపోవడం, మరోవైపు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. సంస్థ ఆస్తులను అమ్మి, తమకు చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్‌ కుట్రలను అడ్డుకుంది. ఇదేక్రమంలో ప్రజాసంకల్పయాత్రలోనూ అడుగుడునా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని కాజేయాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. వారి బాధలను విన్న వైఎస్‌ జగన్‌ తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతాక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.

అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటిని తుడిచే చర్యలు
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే  జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్‌లోనే బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయప్రక్రియలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే బాధితులకు చెల్లింపులు చేయాలనే నిర్ణయాన్ని కార్యరూపంలోనికి తీసుకువచ్చారు. 10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గత నెల అక్టోబర్‌ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి న్యాయం జరుగుతోంది. డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ(డీసీఎల్‌) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల రీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు ఉన్న మరో 4లక్షలమంది డిపాజిట్‌దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

జిల్లాల వారీగా అగ్రీగోల్డ్ బాధితులకు తొలిదశ పంపిణీ వివరాలు

జిల్లాలు బాధితుల సంఖ్య చెల్లించే మొత్తం
విశాఖపట్నం  52,005 45,10,85,805
విజయనగరం     57,941     36,97,96,900
శ్రీకాకుళం     45,833     31,41,59,741
పశ్చిమ గోదావరి 35,496 23,05,98,695
తూర్పుగోదావరి 19,545 11,46,87,619
కృష్ణాజిల్లా 21,444     15,04,77,760
గుంటూరు     19,751   14,09,41,615
ప్రకాశం      26,586 19,11,50,904
నెల్లూరు     24,390     16,91,73,466
అనంతపురం 23,838 20,64,21,009
వైఎస్సార్‌ కడప 18,864     13,18,06,875
కర్నూలు     15,705 11,14,83,494
చిత్తూరు జిల్లా 8,257 5,81,17,100
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top