జూలై 1 నుంచి గోదావరికి హారతి | Sakshi
Sakshi News home page

జూలై 1 నుంచి గోదావరికి హారతి

Published Sun, Jun 28 2015 2:43 AM

జూలై 1 నుంచి గోదావరికి  హారతి - Sakshi

* పుష్కరాల కోసం తూ.గోలో 151, ప.గోలో 89 ఘాట్లు
* మంత్రి మాణిక్యాలరావు

సాక్షి, హైదరాబాద్: గంగా నది తరహాలో గోదావరి నదికీ హరతి ఇచ్చే కార్యక్రమాన్ని జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆరంభించనుంది. పుష్కరాలు ముగిసిన తరువాత కూడా నిత్యం ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు తెలిపారు. హారతి ప్రారంభ కార్యక్రమం రాజమండ్రిలో ఘనంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

పుష్కర ఏర్పాట్లపై ఆయన శనివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. పుష్కరాలకు సంబంధించిన పనులు జూలై ఐదో లోగా పూర్తవుతాయని చెప్పారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులతో పాటు మొత్తం పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 1,650 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 151, పశ్చిమ గోదావరి 89 ఘాట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పుష్కరాలకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు ఈ నెల 29న ఢిల్లీకి వెళుతున్నట్టు చెప్పారు. పార్లమెంట్ సభ్యులందరితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఆహ్వానప్రతాలు అందిస్తున్నట్లు తెలిపారు.
 
పిండప్రదాన పూజలకు ఏర్పాటు
పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన పూజ కోసం ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు.
 
పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
జూలై 14 నుంచి 25 వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా ‘4 జీ’ టెక్నాలజీతో పని చేసే సీసీ కెమెరాలతో పాటు డ్రోన్లు వంటి ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు.
 
పుష్కర ఘాట్‌వద్ద తిరుమలేశుని దర్శనం

తిరుమల: గోదావరి పుష్కర భక్తులకు వేంకటేశ్వర స్వామివారిని కనులారా దర్శించుకునే భాగ్యం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం రాజమండ్రిలోని మున్సిపల్ మైదానంలో శ్రీవారి నమూనా ఆలయంతోపాటు,  నమూనా విగ్రహాన్ని నిర్మిస్తోంది. జూలై 14 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాల్లో ఈ ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను తిరుమల తరహాలోనే నిర్వహించనున్నారు. ఉదయం 4 గంటలకు సుప్రభాతం మొదలు రాత్రి 10 గంటల వరకు మూలమూర్తికి నిర్వహించే అన్ని పూజలు, కైంకర్యాలు, ఆర్జిత సేవలన్నీ  వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement