కరోనా లాక్‌డౌన్ : రేపటి నుంచే ఉచిత బియ్యం

Free Rice, Toor to be distribute in Andrapradesh - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్‌ నెలలో 15వ తేదీన, 29వ తేదీన మరో రెండు సార్లు ఉచితంగా బియ్యం, కంది పప్పును ఇచ్చే విధంగా సన్నద్ధమవుతోంది. క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. 

కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలోని పేదకుటుంబాల ఆహార భద్రతకు ముప్పురాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇది వరకే సీఎం వైఎస్‌ జగన్‌ మార్చి 29నే ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం నుంచి ఈ రేషన్‌ను అందిస్తారు. దీంతోపాటు ఏప్రిల్‌ 15న మరోసారి రేషన్‌ను పంపిణీచేయనున్నారు. అప్పుడు కూడా నిర్దేశించిన బియ్యంతోపాటు, కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఏప్రిల్‌ 29న మూడోసారి రేషన్‌ను అందించనున్నారు. బియ్యంతోపాటు, కేజీ కందిపప్పును ప్రతి పేదకుటుంబానికీ ఇవ్వాలని నిర్ణయించారు. 

కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్‌ ఇస్తున్నట్టు ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకం కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకూ ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఎప్పటిలానే ఏప్రిల్‌ ఒకటోతేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను డోర్‌డెలివరీ చేయనున్నారు. వీటితోపాటు సీఎం ప్రకటించిన విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికీ రూ.1000ల చొప్పున ఏప్రిల్‌ 4వ తేదీన ఆర్థిక సహాయం చేయనున్నారు. గ్రామ వాలంటీర్ల నేరుగా డోర్‌డెలివరీ చేయనున్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు నిలిచిపోయినా, రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ, పెన్షనర్లను, పేదకుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top