రేషన్‌' ఫ్రీ'

Free Ration Rice Distributig in SPSR Nellore - Sakshi

మొదటి రోజు 1,17,599 మందికి బియ్యం, కందిపప్పు పంపిణీ  

ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో వచ్చే నెల 15 వరకు ప్రక్రియ

సరుకుల పంపిణీలో సామాజిక దూరం అమలు

నెల్లూరు(పొగతోట):  కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ప్రజలు ఇబ్బందులు పడకుండా బియ్యం, కంది పప్పు ఉచితంగా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్‌ పంపిణీ చేశారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 1,17,599 మంది కార్డుదారులకు బియ్యం పంపిణీ చేశారు. 12.37 శాతం మందికి రేషన్‌ పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 9,04,220 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 1,895 చౌకదుకాణాల ద్వారా బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. వచ్చే నెల 15వ తేదీ వరకు రేషన్‌ పంపిణీ చేయనున్నారు. రేషన్‌ పంపిణీకి ప్రత్యేకకాధికారులను నియమించారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో కార్డు దారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రత్యేకాధికారి వేలిముద్ర ద్వారా కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశారు. కంది పప్పు పూర్తి స్థాయిలో సరఫరా కాకపోవడంతో అనేక చౌకదుకాణాలల్లో బియ్యం మాత్రమే పంపిణీ చేశారు.

కందిపప్పు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో సరఫరా చేసి కార్డుదారులకు ఉచితంగా అందజేయనున్నారు. చౌకదుకాణాల వద్ద కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా అందరికీ రేషన్‌ పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోజుకు ఇద్దరు, ముగ్గురు వలంటీర్ల ఆధ్వర్యంలో ఉండే కార్డుదారులకు సమాచారం ఇస్తున్నారు. సమాచారం ఇచ్చిన కార్డుదారులు చౌకదుకాణానికి వస్తే ప్రత్యేక అధికారులు కార్డులో వివరాలు నమోదు చేసి రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుడికి బదులు ప్రత్యేకాధికారి వేలిముద్ర వేస్తున్నాడు. కార్డుదారులు అవస్థలు పడకుండా రేషన్‌ పంపిణీ చేస్తున్నారు. చెక్కర మాత్రం కార్డుదారులు కొనుగోలు చేయాల్సి ఉంది. కందిపప్పు అవసరం అనుకున్న కార్డుదారులు నగదు చెల్లిస్తే మరొక కేజీ కందిపప్పు ఇస్తున్నారు. 

సక్రమంగా సరుకుల పంపిణీ
ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశించారు. తన క్యాంప్‌ కార్యాలయంలో సివిల్‌ సప్లయ్స్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. రేషన్‌ పంపిణీ ప్రక్రియలో కార్డుదారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒక్కో చౌక దుకాణంలో రోజుకు 100 నుంచి 150 మంది కార్డుదారులకు మాత్రమే రేషన్‌ను పంపిణీ చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం లారీలు త్వరగా అన్‌లోడ్‌ చేసుకునేలా చర్యలు చేపట్టాలని, ఇప్పటి వరకు 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వెల్లడించారు. డీఎస్‌ఓ బాలకృష్ణారావు, డీఎం రోజ్‌మాండ్, వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి తిరుపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top