ఆరోగ్యానికి బాల సురక్ష | Free health Checkups For Children in West Godavari | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి బాల సురక్ష

Dec 3 2018 12:08 PM | Updated on Dec 3 2018 12:08 PM

Free health Checkups For Children in West Godavari - Sakshi

బాల సురక్ష కార్యక్రమంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

ఏలూరు టౌన్‌ : చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. చిన్నతనం కావటంతో శారీరకంగా ఏర్పడే చిన్నపాటి లోపాలను ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి. ఇంట్లో తల్లీదండ్రీ ఈ లోపాలను గుర్తించలేకపోవటం, మానసికంగా పిల్లల ను నలిపేస్తుంది. ఈ సమస్యలతో పిల్లలు అసాధారణంగా ప్రవర్తిస్తుంటారు. ఇక హైస్కూల్, ఇం టర్‌ స్థాయి చదివే విద్యార్థుల్లోనూ శారీరక లోపాలు, అనారోగ్యం బాధిస్తూ చదువుపై శ్రద్ధ చూ పించకపోవడానికి కారణాలవుతున్నాయి. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) అమలుచేస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకంగా అమలుచేస్తూ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.

పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఈ పథకం కింద 30 బాల సురక్ష వాహనాలు ఏర్పాటుచేశారు. ఒక్కో వాహనంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు ఉంటారు. ఈ వాహనాలు పీహెచ్‌సీల పరిధిలో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కాలేజీలకు వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించి, పిల్లలకు ఆరోగ్య కార్డులు ఇస్తారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే వెంటనే పిల్లలను ఆయా ఆసుపత్రులకు రిఫర్‌ చేయడంతో పాటు శస్త్రచికిత్సలు చేయిం చాల్సిన బాధ్యత వారిదే.

1.70 లక్షల మందికి వైద్య పరీక్షలు
జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సుమారు 5లక్షల మంది పిల్లలు ఉండగా ఈ విద్యాసంవత్సరంలో సుమారు లక్షా 70 వేల మంది పిల్లలు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

పిల్లలకు వైద్య పరీక్షలు ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లే బాలల నుంచి జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థుల వరకూ ప్రతిఒక్కరికీ కొన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.  లోపాలను గుర్తిస్తే వెంటనే ఏలూరులోని జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రానికి (డీఈఐసీ) తరలించి, నిపుణులైన వైద్యులతో పరీక్షల అనంతరం అవసరమైతే ఆపరేషన్లు చేయిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా నలుగురు వైద్యులు, సైకాలజిస్టు, ల్యాబ్స్, పిల్లల మానసిక వికాసానికి ఆటగదులు వంటివి ఏర్పాటు చేశారు.

పరీక్షలు ఇవే..
న్యూరల్‌ ట్యూబ్‌ లోపం, డౌన్స్‌ సిండ్రోమ్, గ్రహణం మొర్రి, పెదవి చీలిక, క్లబ్‌ ఫుట్, నడుం భాగం వృద్ధి లోపం, సంక్రమిక కంటిపొర, పుట్టుకతో వచ్చే చెవుడు, సంక్రమిక గుండె జబ్బులు, రెటినోపతి ఆఫ్‌ ప్రీ మెచ్యూరిటీ, రక్తహీనత, విటమిన్ల లోపం, పోషకాహార లోపం, చర్మవ్యాధులు, రుమాటిక్‌ గుండె వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు, పిప్పి పళ్లు, మూర్చ వ్యాధి, దృష్టి సమస్యలు, మేధోపరమైన అసమానత, వయసుకు అనుగుణంగా మాటలు రాకపోవటం, ఆటిజమ్, అభ్యసనా సమస్యలు, థలసీమియా వంటి 30 రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు.

పిల్లల్లో లోపాలు గుర్తించాలి  
పిల్లల శారీరక, మానసిక సమస్యలను తెలుసుకోవాలి. ఇంట్లో తల్లీదండ్రీ పిల్లల సమస్యలపై శ్రద్ధ పెట్టాలి. పాఠశాలల్లో పిల్లల ఆరోగ్య సమస్యలను పరీక్షించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉండి ఆపరేషన్లు అవసరమని గుర్తిస్తే ఆయా వైద్య నిపుణులకు రిఫర్‌ చేస్తాం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు అవరోధాలుగా మారుతున్న ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు వహించాల్సి ఉంది. జిల్లాలోని 30 బాల సురక్ష వాహనాల ద్వారా ఈ ఏడాది చివరి నాటికి ప్రతి విద్యార్థికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాం.–కె.గణేష్, జిల్లా ఎగ్జిక్యూటివ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement