అప్రమత్తంగా లేకపోతే అంతే..

Fraud in Viziangaram Petrol Bunks - Sakshi

పెట్రోల్‌ బంకుల్లో విచ్చలవిడిగా మోసాలు

నాణ్యతను స్వయంగా పరిశీలించుకోవచ్చు..

తాగునీరు, షెడ్డు తప్పనిసరి

 రీడింగ్‌ కచ్చితంగా చూడాల్సిందే..

విజయనగరం పూల్‌బాగ్‌: నేటి సమకాలీన సమాజంలో పెట్రో ఉత్పత్తులు నిత్యావసర వస్తువులుగా మారాయి. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు కూడా పాల్పడుతున్నారు. పెట్రోల్, డీజిల్‌ కొట్టించేటప్పుడు తప్పకుండా రీడింగ్‌ చూసుకోవాలి. అయితే ఎక్కడైనా కొలతల్లో తేడాలొస్తే వినియోగదారులు పౌరసరఫరాల అధికారులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చు. పెట్రోల్, డీజిల్‌ కొనుగోలులో నాణ్యత, కొలతల్లో తేడాలను పరిశీలించేందుకు బంకుల వద్ద నాణ్యతా పరికరాలను తప్పనిసరిగా ఉంచాలి. అలాగే బంకుల వద్ద మినరల్‌ వాటర్‌ అందుబాటులో ఉంచాలి.

నాణ్యతా పరీక్షలిలా...
పెట్రోల్‌ పంపు నాజిల్‌ నుంచి ఒక చుక్క పెట్రోల్‌ను ఫిల్టర్‌ కాగితంపై వేయాలి. రెండు నిమిషాల తర్వాత పెట్రోల్‌ పూర్తిగా ఆవిరైపోతుంది. అయితే కాగితంపై ఎలాంటి మరక లేకపోతే ఆ పెట్రోల్‌ నాణ్యమైనదిగా.. ఒకవేళ మరక ఏర్పడితే కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి. పెట్రోల్‌ బంకుల వద్ద ఇంధన సాంద్రత ఎంత ఉందో వినియోగదారుడికి తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. పెట్రోల్‌ అయితే నాలుగు, డీజిల్‌ అయితే రెండు ప్రకారం నమూనా బాక్సులలో సాంద్రత నమోదు చేయాలి. కంపెనీ నుంచి వచ్చిన ఇంధనం, బంకుల్లో నమోదైన ఇందన సాంద్రతకు మధ్య మూడు పాయింట్ల మించితే కల్తీ జరినట్లే. వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

పాటించాల్సిన నిబంధనలు...
పెట్రో బంకుల్లో మూడు వైపులా ఆరు అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించాలి. ప్రాథమిక చికిత్స కిట్లు ఏర్పాటు చేయాలి. బంకుల వద్ద అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్ర పరికరాలతో పాటు మూడు బకెట్ల ఇసుక, మూడు బకెట్ల నీరు ఏర్పాటు చేయాలి. లారీ ఇసుక, ఐదువేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. విద్యుత్‌ వైర్లు బయటకు కనిపించకుండా వైరింగ్‌ ఉండాలి. ట్యాంకు పరిసరాల్లో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు, టెలిఫోన్‌ తీగలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్రోల్‌ వేయించుకున్న వాహనాలకు ఉచితంగా గాలి కొట్టాలి. 2003 నిబంధనల ప్రకారం బంకుల్లో సౌకర్యాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ శాఖ ధ్రువీకరణ పత్రం పొందాలి. బంకుల్లో నాణ్య తను పరిశీలించడానికి హైడ్రో థర్మామీటర్‌ అందుబాటులో ఉండాలి. వాహనదారులు ఆ పరికరాలను అడిగితే తప్పనిసరిగా ఇవ్వాలి. వాహనదారులకు ఎండ, వాన నుంచి రక్షణ ఇచ్చేందుకు ప్రతి బంకు వద్ద ఎత్తైన షెడ్డు  నిర్మించాలి.

రీడింగ్‌ ఎంత ఉందో...
పెట్రోల్‌ లేదా డీజిల్‌ పోయించుకునేటప్పుడు పెట్రో మీటర్‌ రీడింగ్‌ జీరో ఉంటేనే పెట్రోల్‌ పోయించుకోవాలి. రూపీ మీటరులో లీటరు, మీటర్‌కు వ్యత్యాసం తెలుసుకోవాలి. లేకపోతే లీటరు మీటర్‌ను.. రూపీ మీటర్‌గా పొరబడే అవకాశముంది. ఇలా జరిగితే వాహనదారు డు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top