
పీఎంపాలెం (భీమిలి): ఆన్‌లైన్‌లో ప్రకటన చూసి కారు కొనదలచిన వ్యక్తి రూ.లక్షా 86 వేలు పోగొట్టుకున్నాడు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలు... కారు విక్రయించడానికి సిద్ధంగా ఉందంటూ ఓఎల్‌కే పేరున ఆన్‌లైన్లో వెలువడిన ప్రకటన చూసి పాత మధురవాడ మెట్ట ప్రాంతానికి చెందిన బి.భాస్కరరావు ఆకర్షితుడయ్యాడు. ఆ ప్రకటనలో సూచించిన నంబరుకు ఫోను చేసి సంప్రదించాడు.
ప్రకటనలో పేర్కొన్న విధంగా తమ బ్యాంకు అకౌంట్‌లో సొమ్ము జమ జేస్తే కారు సొంతం అవుతుందని అవతల వ్యక్తి ఫోనులో తెలియజేశాడు. అతను చెప్పిన విధంగానే ఈ నెల 8వ తేదీన భాస్కరరావు రూ.లక్షా 86 వేలు బ్యాంకు అకౌంట్‌కు జమ చేశాడు. కారు రాలేదు సరిగదా అవతలి వ్యక్తి ఫోను స్విచ్ ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అవతల వ్యక్తి ఫోను నంబరును బట్టి ఆ నంబరు ఛత్తీస్‌గఢ్‌దని గుర్తించామని సీఐ తెలిపారు. కేసును సైబర్ విభాగానికి అప్పగించామన్నారు.