వేతన వెతలు

four months wages pending in 108 ambulance staff  - Sakshi

108 సిబ్బందికి నాలుగు నెలలుగా అందని వేతనాలు

అల్లాడిపోతున్న కుటుంబాలు

సాక్షి, విశాఖపట్నం: ఒక నెల జీతాలు అందకపోతేనే మధ్య తరగతి ఉద్యోగులు అల్లాడిపోతారు. కుటుంబం గడవడం ఎలా? అంటూ సతమతమైపోతారు. కానీ నెలా? రెండు నెలలు కాదు.. నాలుగు నెలలు జీతాల్లేకుండా కుటుంబాలను ఈడ్చడం ఎంత కష్టం? ఇప్పుడు అలాంటి కష్టాలనే 108 సిబ్బంది అనుభవిస్తున్నారు. ఇన్నాళ్లూ జీవీకే సంస్థ ఆధ్వర్యంలో 108 అంబులెన్స్‌ల సిబ్బంది పనిచేసేవారు. గత డిసెంబర్‌ 13న జీవీకే నుంచి 108ల నిర్వహణ బాధ్యతలను మహారాష్ట్రకు చెందిన బీవీజీ (భారత్‌ వికాస్‌ గ్రూప్‌) సంస్థ తీసుకుంది. అప్పటికే రెండు నెలల నుంచి జీవీకే సంస్థ 108 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు చెల్లించడం మానేసింది. కొత్తగా వచ్చిన బీవీజీ సంస్థ అయినా పాత బకాయిలతో పాటు జీతాలను సక్రమంగా చెల్లిస్తుందని వీరు సంబరపడ్డారు.

కానీ బీవీజీ కూడా అదే బాటలో పయనిస్తూ జీతాలివ్వడం లేదు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ఈ సిబ్బంది ఆందోళన చేపట్టడంతో జనవరిలో రూ.7 వేల చొప్పున అడ్వాన్సు రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత ఇక జీతాల జోలికే వెళ్లడం మానేశారు. ఒక్కో అంబులెన్స్‌లో షిఫ్టుల వారీగా సగటున ఐదుగురు విధులు నిర్వహిస్తారు. వీరిలో పైలట్లు (డ్రైవర్లు), ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్లు ఉంటారు. ఇలా విశాఖ జిల్లాలో 108 అంబులెన్స్‌లు 45 ఉన్నాయి. వీటిలో నాలుగింటిని స్పేర్‌గా ఉంచుతారు. 41 అంబులెన్స్‌లను నగరంలోనూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 185 మంది 108 అంబులెన్స్‌ల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.11,000 నుంచి 12,000 వరకు జీతాలు చెల్లిస్తుంటారు. ఆఖరిసారిగా వీరు గత అక్టోబర్‌లో వేతనాలు అందుకున్నారు. నెలలు తరబడి జీతాలివ్వకపోవడం వల్ల పిల్లాపాపలతో ఉన్న వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు.

తమ వేతనాల గురించి జీవీకే సంస్థ ప్రతినిధులను అడిగితే ప్రభుత్వం నుంచి తమకు బకాయిలు రావలసి ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని... కొత్తగా వచ్చిన బీవీజీ గ్రూప్‌ యాజమాన్యాన్ని అడుగుతుంటే ఇటీవలే బాధ్యతలు తీసుకున్నామని, అంతా సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారని 108 సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వీరు వాపోతున్నారు. తమకు జీతాలు చెల్లించేలా చూడాలని 108 సిబ్బంది యూనియన్‌ నాయకులు ఇటీవల విజయవాడలోని కార్మికశాఖ కమిషనర్‌ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు. దీంతో ఆయన జీవీకే, బీవీజీ సంస్థలతో పాటు 108 సిబ్బంది యూనియన్‌ ప్రతినిధులతో కలిసి ఈనెల 8న సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ సమావేశాన్ని ఈ నెల 22కి వాయిదా వేయడంతో వీరంతా డీలా పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top