అప్పుడే పవర్రీస్! | Sakshi
Sakshi News home page

అప్పుడే పవర్రీస్!

Published Sun, Mar 2 2014 5:04 AM

four-hour power cuts in Vizianagaram

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వేసవి ప్రారంభానికి ముందే విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో జిల్లా వాసులకు ఈ ఏడాది కూడా కరెంట్ కష్టాలు తప్పేటట్టు లేవు. జాతీయ గ్రిడ్‌తో సదరన్ గ్రిడ్‌ను అనుసంధానం చేయడం వల్ల విద్యుత్ కోతలుండవని అధికారులు గొప్పగా ప్రకటించినా అవన్నీ వట్టి ‘కోత’ లుగానే మిగిలిపోతున్నాయి. ఒక వైపు జిల్లా కేంద్రంలో నాలుగు గంటల పాటు విద్యుత్‌కోతను విధించడానికి సిద్ధమవుతూనే పరిశ్రమలకు సోమవారం పవర్ హాలీడే ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. డెడికేటెడ్, ఎక్స్‌ప్రెస్ ఫీడర్లు ఉన్న పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది.
 
 పెరుగుతున్న అనధికార కోతలు
 మరో వైపు జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తలెత్తుతున్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో  తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా సుమారు 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కోతలు పెరిగినట్టు చెబుతున్నారు. దీంతో గత కొద్ది రోజుల వరకు గృహావసర విద్యుత్ కనెక్షన్‌లకు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్న విద్యుత్ శాఖ, పరిశ్రమలకు అందుకు మినహాయింపు ఇవ్వలేదు. పరిశ్రమల్లో పనులు స్తంభించి అటు కార్మికులు, ఇటు యాజమాన్యాలకు అవస్థలు మొదలయ్యాయి.
 
 వాస్తవానికి గృహావసరాల విద్యుత్ కనెక్షన్లకు జిల్లా కేంద్రంలో కేవలం రెండు గంటలు మత్రమే అనధికారిక కోత విధిస్తుండగా... గత రెండు రోజుల్లో ఆ సమయం నాలుగు గంటలకు పెరిగింది. ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈఎల్‌ఆర్ విధిస్తున్నారు. అదేవిధంగా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పగటి పూట పరిస్థితి ఎలా ఉన్నా రాత్రి వేళల్లో సైతం రెండు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
 మూడు రోజులుగా పరిశ్రమలకు ఈఎల్‌ఆర్‌ను అమలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో అధికంగా విద్యుత్ వినియోగించే ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమలకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈఎల్‌ఆర్ పేరిట సరఫరా నిలిపివేస్తున్నారు. కేవలం పరిశ్రమల ఆవరణలో ఉన్న లైటింగ్‌కు మాత్రమే విద్యుత్ సరఫరాను వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. 
 
 తగ్గుతున్న కేటాయింపులు 
 ఇదిలా ఉండగా జిల్లాకు అవసరమయ్యే విద్యుత్ కేటాయింపులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జిల్లాలో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సుమారు 5 మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరం ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతుండగా ప్రస్తుతం కేటాయింపు 4.772 ఎంయూ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో ఈఎల్‌ఆర్ అమలు చేస్తున్న  4.488 ఎంయూ వినియోగం రోజులో జరుగుతున్నట్లు చెబుతున్నారు.  కేటాయింపులు మెరుగుపడితే కాని సరఫరా మెరుగుపడే అవకాశాలు ఉండవని, పరిస్థితి రెండు రోజుల్లో అదుపులోకి వస్తుందని ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 
 

Advertisement
Advertisement