మాజీ స్పీకర్‌ అగరాల ఈశ్వర్‌ రెడ్డి మృతి

Former Assembly Speaker Agarala Eshwar Reddy Passed Away In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : విద్యావేత్త, తిరుపతికి చెందిన  తొలితరం నాయకులు,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మాజీ స్పీకర్‌ డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి(87) ఆదివారం మృతి చెందారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 02.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈయన రెండు పర్యాయాలు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఆయన స్వగ్రామం రేణిగుంట సమీపంలోని తూకివాకం. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తిరుపతిలోనే స్థిర పడగా, కుమార్తె చెన్నైలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ...మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు.

డాక్టర్‌ ఈశ్వర రెడ్డి తిరుపతి శాసన సభ నియోజకవర్గం నుంచి 1967, 1978లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  తెలుగ దేశం ప్రభంజనంలో 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తిరుపతి, రేణిగుంటలలో విద్యా సంస్థలు స్థాపించి విద్యాదానం చేస్తున్నారు. ఆచార్య ఎన్జీరంగా, మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌లకు శిష్యుడిగా గుర్తింపు పొందారు. 1982 సెప్టెంబర్‌ 7 నుంచి 1983 జనవరి 16వరకు స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు 1981 మార్చి 23 నుంచి 1982 సెప్టెంబర్‌ 6 వరకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 

స్వతంత్ర పార్టీ నుంచి ఎన్నిక:
1962లో డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌లో చేరి స్వతంత్ర అభ్యర్థి గురవారెడ్డిపై గెలుపొందారు.  అప్పటి సీఎం టీ. అంజయ్య ఈయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అనంతరం ఇందిరాగాంధి ఆశీస్సులతో స్పీకర్‌గా నియమితులయ్యారు. 1983లో టీడీపీ ఏర్పాటు చేశాక,టీడీపీ ప్రభంజనంలో  ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్‌టీరామారావుపై పోటీ చేసి ఓడిపోయారు.

విద్యావేత్త:
డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి  మద్రాస్‌ రెసిడెన్సీ కళాశాలనుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచిఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. మద్రాస్‌ లా కళాశాల నుంచి బీఎల్‌ డిగ్రీ పొందారు. అలాగే రాంచీ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్‌ పొందారు. విద్యాసంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక పుస్తకాలు రచించారు. ఎస్వీయూ, ఏపీ వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు సిండికేట్‌ సభ్యుడిగా పనిచేశారు. ఉస్మానియా వర్సిటీకి సెనెట్‌ మెంబర్‌గా పనిచేశారు.

సోమవారం అంత్యక్రియలు:
డాక్టర్‌ అగరాల ఈశ్వర రెడ్డి భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం తిరుపతిలోని గోవింతదామంలో అంత్యక్రియలు జరపనున్నారు. అగరాల మరణ వార్త తెలియగానే తిరుపతి యువనేత భూమన అభినయ్‌ రెడ్డి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి,సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తిరుపతికి లోటని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top