కొబ్బరి బోండాల్లో ‘ఎర్ర’దుంగలు | Forest officials caught red wood load in Coconuts | Sakshi
Sakshi News home page

కొబ్బరి బోండాల్లో ‘ఎర్ర’దుంగలు

Nov 11 2014 1:46 AM | Updated on Oct 4 2018 6:03 PM

చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారులు కొబ్బరి బోండాల లోడ్‌తో వెళుతున్న ఓ లారీని పట్టుకున్నారు.

చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారులు కొబ్బరిబోండాల లోడ్‌తో వెళుతున్న ఓ లారీని పట్టుకున్నారు. ఇందులో పైన కొబ్బరి బోండాలు, లోపల 107 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గుర్తించారు.

చిత్తూరు (అర్బన్) : కొబ్బరి బోండాల కింద ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీని సోమవారం తెల్లవారు జామున అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పది చక్రాల లారీలో చిత్తూరు నుంచి యాదమరి మీదుగా తమిళనాడుకు ఈ ఎర్రచందనం తరలిస్తున్నట్టు చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు చిత్తూరు నగరంలోని మాపాక్షి-తుమ్మిందపాళెం రోడ్డులో అటవీశాఖాధికారులు వేచిఉండగా అటువైపు వస్తున్న లారీని ఆపడానికి ప్రయత్నిస్తే ఆగలేదు. కొట్టాల సమీపంలో తమిళనాడుకు 800 మీటర్ల దూరం ఉందనగా లారీ వేగం పెరిగింది. అదుపుతప్పి పక్కనే ఉన్న ఓ గుంతలో ఒరిగిపోయింది.

అందులోని వ్యక్తులు పారిపోయారు. ఆ లారీలో దాదాపు రెండు వేల కొబ్బరి బోండాలు ఉన్నారుు. దీని కోసం రాత్రిపూట ఛేజింగ్ చేశామా.. అన్నట్టు అటవీశాఖ అధికారులు నిట్టూర్చారు. తీరా కొబ్బరి బోండాల కింద కొయ్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. సోమవారం ఉదయం ఈ లారీ తమిళనాడు సరిహద్దులో ఉం దని అక్కడి అటవీశాఖ అధికారులు, కాదు మా సరిహద్దేనని చిత్తూరు అధికారుల వాగ్వాదాలు జరిగారుు. తాము చేసిన ప్రయత్నాన్ని చిత్తూరు అటవీశాఖ అధికారులు తమిళనాడు అధికారులకు వివరించగా, దాదాపు 3 టన్నుల బరువుగల 107 ఎర్ర చందనం దుంగల్ని మన అధికారులకు అప్పగించారు.  

రూ. 70 లక్షల విలువ...
చిత్తూరు పశ్చిమ అటవీశాఖ రేంజర్ నారాయణస్వామి మాట్లాడుతూ అటవీశాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున దుంగల్ని స్వాధీనం చేసుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. లారీతో కలిపి పట్టుబడ్డ సరుకు విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. లారీని వెంబడించినప్పుడు కొద్ది దూరం వెళ్లాక అందులోని వ్యక్తులు తమపై దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు.  లారీ ఓ గుం తలో దిగబడటంతో వారు పారిపోయారన్నారు.

కొట్టాల గ్రామస్తులు, యాదమరి పోలీసుల సాయంతో లారీని, అందులోని దుంగల్ని స్వాధీనం చేసుకున్నామని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని చెప్పారు. ఈ దాడిలో డెప్యూటీ ఎఫ్‌ఆర్‌వో సుభాష్, సిబ్బంది హరిబాబు, హరికుమార్, నాగరాజు, కళ్యాణి, గణేష్‌బాబు, రమేష్, ప్రసాద్, ప్రకాష్, సతీష్, భాషా పాల్గొన్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement