విదేశీయుల ఆధ్యాత్మిక చింతన

Foreigners Visit vizianagaram For Ganapathi Puja - Sakshi

టెక్కలికి తరలివచ్చిన 10 దేశాలకు చెందిన వంద మంది విదేశీయులు

గ్రామీణ ప్రాంత ఆచారాలు,కట్టుబాట్లు పరిశీలన

ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం

నెల్లిమర్ల రూరల్‌: భారతదేశ యువత పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ.. భారతీయ సంస్కృతిని పెడచెవిన పెడుతున్న రోజుల్లో.. విదేశీయులు భారతదేశ సంస్కృతిని అమితంగా ఇష్టపడుతున్నారు. భారతీయుల సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామం వేదికైంది.వరల్డ్‌ టీచర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్ప్రెయిన్, జర్మనీ తదితర పది దేశాల నుంచి 100 మంది విదేశీయులు గ్రామానికి ఆదివారం విచ్చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆచారాలను, వ్యవహారశైలిని దగ్గరుండి తిలకించారు. గ్రామానికి విచ్చేసిన విదేశీయులకు ఆ గ్రామ ప్రజలు, జగద్గురు పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు దారి పొడువునా నిలిచి చిరునవ్వులతో పూలను అందించారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణ నడుమ గ్రామ పోలిమేరల నుంచి పాదయాత్రగా టెక్కలిలో రామాలయానికి తీసుకువచ్చారు. విదేశీయులందరూ హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో విశేష పూజలు జరిపారు. గణపతి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి మురిసిపోయారు. అనంతరం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలను సందర్శించి గో పూజలు నిర్వహించారు. ట్రస్టు ప్రతినిధులు బీఆర్‌కేరాజు, ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి, మాజీ సర్పంచ్‌ కర్రోతు రాజినాయుడు తదితరులు సేవలందించారు.

ఏటా విశాఖకు విదేశీ బృందం...
మానవుడికి కావాల్సిన జ్ఞానాన్ని అన్ని మతాలు బోధిస్తాయి. అలా మానవుడిని ఉన్నతిగా నడిపించడం కోసం చేసిన ప్రయత్మమే గురుతత్వం. గురువుగా ఉన్నది తత్వమే గాని వ్యక్తి మాత్రం కాదు అనేది వరల్డ్‌ టీచర్‌ ట్రస్టు సిద్ధాంతం. సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటివరకు జీవిని నడిపిస్తునటువంటి గురువును జగద్గురువని పిలుస్తారని, వారి పేరిట ఈ ట్రస్టును ఏర్పాటు చేసినట్టు నిర్వాహుకులు తెలిపారు. ఈ వరల్డ్‌ టీచర్‌ ట్రస్టును విశాఖపట్నంకు చెందిన ఎక్కిరాల కృష్ణామాచార్యులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ట్రస్టు 126 దేశాల్లో విస్తరించి ఉంది. ఏటా జనవరి నెలలో 11, 12, 13 తేదీల్లో విశాఖ జిల్లా సింహాచలం కొండ దిగువున అంతర్జాతీయ యోగా సమావేశాలను నిర్వహిస్తుంటారు. వరల్డ్‌ టీచర్‌ ట్రస్టు తరఫున వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు అధిక సంఖ్యలో విశాఖకు తరలివచ్చి ఏటా క్రమం తప్పకుండా సమావేశాలకు హజరవుతారు. ఇందులో భాగంగా ఆధ్యాత్మిక బావాలను తెలుసుకుంటారు. దీనిలో భాగంగా నెలరోజుల కిందటే విదేశీయులంతా విశాఖకు విచ్చేశారు. ట్రస్టు ప్రతినిధి‡ స్వగ్రామం టెక్కలి కావడంతో గ్రామీణ ప్రాంత ప్రజల వ్యవహారశైలి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వారంతా గ్రామానికి విచ్చేశారు. వీరి రాకతో టెక్కలిలో సందడి వాతావరణం నెలకొంది.

భారతీయ సంస్కృతి గొప్పది...
భారతీయుల సంస్కృతి గొప్పది. వారి ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో నచ్చుతాయి. మేమంతా సంస్థ తరఫున ఏటా భారతదేశంలో ఉన్న విశాఖపట్నంకు వస్తుంటాం. యోగా, ఆధ్యాత్మిక తరగతులను నిర్వహిస్తుంటాం. పట్టణంలో ఉన్న కల్చర్‌కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఇక్కడి ప్రజలు ఇస్తున్న గౌరవం మరువలేనిది.        – గాబ్రియల్‌ ఫారెస్, స్పెయిన్‌ దేశస్తురాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top