సమైక్యం కోసం ప్రత్యక్షపోరాటం | For the unity of special war | Sakshi
Sakshi News home page

సమైక్యం కోసం ప్రత్యక్షపోరాటం

Aug 12 2013 6:03 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్రవిభజన ప్రక్రియను ముందే పసిగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు తమ పదవులకు జూలైలోనే రాజీనామాలు చేసి నిరసన తెలిపారు.

సాక్షి, కడప: రాష్ట్రవిభజన ప్రక్రియను ముందే పసిగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డిలు తమ పదవులకు జూలైలోనే రాజీనామాలు చేసి నిరసన తెలిపారు. రాజీనామాలపై మరో ఆలోచన లేకుండా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను పంపారు. అయినన్పటికీ కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయనున్నట్లు  ఏఐసీసీ అధికారప్రతినిధి అజయ్‌మాకెన్, కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఈనెల 30న ప్రకటించారు. దీంతో మరోసారి తమ పదవులకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు.
 
 జూలై 31 నుంచి జిల్లా వాసులు సమైక్య ఉద్యమం పేరుతో రోడ్డెక్కారు. దీంతో సమైక్యరాష్ట్రం కోసం జిల్లాకు చెందిన నేతలు పలురకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్‌పార్టీ, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్‌పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆరురోజుల పాటు కలెక్టరేట ఎదుట ఆమర ణ నిరాహారదీక్ష చేశారు. ఈ నెల 10న నిత్యానందరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలుగుప్రజలపై కాంగ్రెస్‌పార్టీ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్సార్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మలు కూడా రాజీనామాలు చేసి నిరసన తెలిపారు. ప్రధానపార్టీలకు చెందిన పార్టీ అధినేతల్లో రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి కావడంతో జిల్లా వాసులతో పాటు సీమాంధ్ర ప్రజలంతా జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
 
 ఈక్రమంలో సమైక్య ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు  ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డిలు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నారు. విభజనపై కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ దీక్ష కొనసాగుతుందని, ఈ ప్రక్రియలో తమ ప్రాణాలు పోయినా లెక్కచేయమని శ్రీకాంత్, రవీంద్రనాథరెడ్డిలు తెలిపారు. ఈ ఆమరణదీక్షను జేఏసీ నేతలు కూడా స్వాగతించారు. వైసీపీ నేతల ఆమరణదీక్ష నిర్ణయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. సమైక్య రాష్ట్రం కోసం పార్టీ అధ్యక్షుడితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడం, ఇప్పుడు ఆమరణ దీక్షలకు సిద్ధపడటంతో ప్రజల్లోకి తాము ఎలా వెళ్లాలని ఆలోచనలో పడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు  ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం లేదని వారు కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని ప్రజల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. టీడీపీ చెందిన ఎంపీ సీఎం రమేశ్‌తో లింగారెడ్డి కూడా ఉద్యమంలో పాల్గొనాలని జిల్లా వాసులు డిమాండ్ చే స్తున్నారు. సీమ కష్టాలు గుర్తెరిగి ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పదవులను త్యజిస్తూ ఉద్యమంలో పాల్గొంటున్న వైసీపీ నేతలను చూసి ఉద్యమం ఎలా సాగుతుందో, అధికార, ప్రతిపక్షాలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో ఆలోచించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement