గండికోటకు ఐదు టీఎంసీల నీరు | FIVE TMC water | Sakshi
Sakshi News home page

గండికోటకు ఐదు టీఎంసీల నీరు

Sep 4 2014 1:58 AM | Updated on Sep 2 2017 12:49 PM

తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు ఐదు టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేసేందుకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరించారని కలెక్టర్ కేవీ రమణ తెలిపారు.

కడప సెవెన్‌రోడ్స్ : తాగు, సాగునీటి అవసరాల దృష్ట్యా జిల్లాలోని గండికోట రిజర్వాయర్‌కు ఐదు టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేసేందుకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరించారని కలెక్టర్ కేవీ రమణ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో నీటిపారుదలశాఖ అధికారులు, జీఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక కలెక్టర్ సుబ్బారెడ్డితో ఆయన చర్చించారు. గండికోట రిజర్వాయర్ నీటి లభ్యత, పునరావాస పనులపై సమీక్షించారు. గతంలో మూడు టీఎంసీల జలాలను గండికోటలో నిల్వ ఉంచేందుకు ఐదు గ్రామాలను ఖాళీ చేయాల్సి వచ్చిందని, ఈ ఏడాది ఐదు టీఎంసీలు నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
 
 ముంపునకు గురయ్యే గ్రామాల్లో చవటపల్లె, సీతాపురం, గండ్లూరు, ఓబన్నపేట, కె.బొమ్మేపల్లె, దొరువుపల్లె, బుక్కపట్నం, రంగాపురం ఉన్నాయని వివరించారు. ఈ గ్రామాల్లో 2706 మంది ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసిత కుటుంబాల వారు ఉన్నట్లు చెప్పారు. వీరిలో సుమారు వెయ్యి మందిని ఇంతకుమునుపే మరో ప్రాంతానికి తరలించారన్నారు. ఈ ఏడాది అవుకు నుంచి గండికోటకు ఐదు టీఎంసీల నీరు చేరేందుకు రెండు నెలల సమయం పడుతుందన్నారు.
 
 నిర్వాసిత కుటుంబీకులకు పునరావాస ప్యాకేజీ చెల్లించేందుకు నిధులు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అంగీకరిచిందన్నారు. ఇప్పటివరకు 32.22 కోట్ల రూపాయలు పునరావాస ఏర్పాట్లకు ఖర్చు చేశారన్నారు. ప్రస్తుతం 18.42 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికి తొమ్మిది పునరావాస కేంద్రాలకుగాను ఏడు కేంద్రాల్లో పనులు పూర్తయినందువల్ల ఎనిమిది గ్రామాల ప్రజలను ఆ కేంద్రాలకు వెంటనే తరలించాలని ఆదేశించారు.  జేసీ  రామారావు, డిప్యూటీ ఎస్‌ఈ లక్ష్మిరెడ్డి, గండికోట రిజర్వాయర్ ఈఈ గంగాధర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ సాయినాథ్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement