జల్సాల కోసం చోరీ 

Five Thieves Are Arrested In Kurnool District - Sakshi

మొదటిసారే దొరికిపోయిన యువకులు  

24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు

సాక్షి, ఆళ్లగడ్డ: వారంతా యువకులు.. కష్టపడకుండా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలనుకున్నారు. పథకం ప్రకారం చోరీ చేసి తప్పించుకున్నామని భావించారు. అయితే 24 గంటలు గడవకుండానే పోలీసులు వారిని పట్టుకుని కటకటాలకు పంపించారు. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని ఏవీ గోడౌన్‌ సమీపంలో శనివారం ఐదుగురు నిందితులను సీఐ రమణ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి  మూడు సెల్‌ ఫోన్‌లు, రూ 5500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ పోతురాజు ఆదివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు.

కోవెలకుంట్ల మండలం కంపమళ్లకు చెందిన సూర విష్ణువర్ధన్‌రెడ్డి, దొర్ని పాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి గత నెల 29వ తేదీ సాహు సినిమా చూడటానికి ఆళ్లగడ్డకు వచ్చారు. నైట్‌ షో తర్వాత గ్రామానికి వెళ్లేందుకు ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులో ఎక్కారు. అయితే వీరి వద్ద పెద్దమొత్తంలో డబ్బులున్నట్లు భావించిన ఆటో డ్రైవర్‌ జెట్టి లక్ష్మణ్‌ తన మిత్రులు నీలిశెట్టి  భూపతి శివ, దొమ్మరి దామోదర్, భూపతి సురేష్‌బాబుకు ఫోన్‌ చేసి రప్పించాడు. ఆటో చింతకుంట శివారు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపానికి వెళ్లే సరికి వారంతా బైకులపై వచ్చి చుట్టుముట్టారు.

ఆటోలో ఉన్న సూర విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిని కిందకు దింపి దగ్గరున్న సొమ్ములు ఇవ్వాలని బెదిరించారు. డబ్బులు లేవని చెప్పడంతో విపరీతంగా కొట్టి మూడు సెల్‌ఫోన్‌లు, రూ.5,500 నగదు లాక్కొని వెళ్లి పోయారు. బాధితులు శుక్రవారం పోలీస్‌ స్టేషన్‌ చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ రమణ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. 24 గంటలు గడవకుండానే నిందితులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ పోతురాజు  తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top