కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా

Five Major Panchayats To Be Upgraded Into Municipalities In Krishna District - Sakshi

నగర పంచాయతీలుగా మారనున్న అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట

జూలై 31వ తేదీ కల్లా ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం

ఆ వెంటనే ఆమోదం కోసం కేబినెట్‌కు

సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్‌ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది.

జిల్లాలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్‌ పంచాయతీలు గ్రేడ్‌–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. 

దశాబ్దకాలంగా పెండింగ్‌..
దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది.

ఐదు పంచాయతీలు ఇవే..
జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్‌ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్‌ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్‌లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు
జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్‌ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం.
– జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top