భారతీయ స్టేట్‌ బ్యాంకులో చెలరేగిన మంటలు

Fire Accident In State bank Of India In Prakasham - Sakshi

రూ.40 లక్షల ఆస్తి నష్టం

సాక్షి, ఉలవపాడు(ప్రకాశం) : ఉలవపాడులోని భారతీయ స్టేట్‌ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నమంటలతో ప్రారంభమై క్యాబిన్‌ మొత్తం కాలి బూడిదయింది. కంప్యూటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, క్లర్క్‌ల క్యాబిన్లు మంటల ధాటికి బుగ్గయ్యాయి. బంగారం భద్రపరిచే గది వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బ్యాంకు వర్గాలు తెలిపాయి. లాకర్‌ రూమ్, మేనేజర్‌ రూమ్‌కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని బ్యాంకు మేనేజర్‌ తెలిపారు.

ఉదయం 5 గంటల సమయంలో పొగతో పాటు చిన్న మంటలు రావడం బ్యాంకు పక్కన ఉన్న ఇంటి వారు గమనించారు. వెంటనే బ్యాంకు సిబ్బందికి తెలియజేయగా వారు వచ్చి తాళాలు తెరిచేలోపు మంటలు మరింత ఎక్కువయ్యాయి. టంగుటూరు నుంచి ఫైర్‌ ఆఫీసర్‌ అంకయ్య ఆ«ధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నికీలల ధాటికి శ్లాబు పెచ్చులూడి పడ్డాయి. క్యాబిన్‌లో ఉన్న మొత్తం ఫర్నిచర్, విలువైన రికార్డులు కాలి బూడిదయ్యాయని బ్యాంకు మేనేజర్‌ శంకర్‌ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు.

​వెల్లువెత్తుతున్న అనుమానాలు 
బ్యాంకు దగ్ధమైన ఘటనలో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో ఫైర్‌ బెల్, అలారమ్‌ కొంత కాలంగా పనిచేయడం లేదని బ్యాంకు సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులతో తెలిపారు. కానీ దానిని బాగుచేయలేదు. ప్రమాదం జరిగే సమయంలో కిటికీలు తెరచి ఉన్నాయి. బ్యాంకులో సీసీ కెమేరాల ఫుటేజీ కావాలని పోలీసులు కోరగా తమ టెక్నీషియన్‌ వచ్చి తీసిస్తాడని బ్యాంకు సిబ్బంది చెప్పడం గమనార్హం. సాధారణంగా పోలీసులు ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ప్రాథమిక సమాచారంతోపాటు విచారణకు ముఖ్యమైన సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారుల సమక్షంలో జరిగిన వెంటనే స్వాధీనం చేసుకోవాలి. కానీ సీసీ ఫుటేజీని బ్యాంకు అధికారులు ఇవ్వలేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేయలేదు. ఈ పరిణామాలు అగ్ని ప్రమాదంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

మూడు బ్యాంకుల్లో సేవలు 
వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మూడు బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఒంగోలు ఆర్‌బీఓ అధికారి జానకిరామ్‌ తెలిపారు. చాకిచర్ల, సింగరాయకొండ, కరేడు స్టేట్‌ బ్యాంకుల్లో ఉలవపాడు బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన అన్ని లావాదేవీలు యథావిధిగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉలవపాడు బ్యాంకు సిబ్బంది మూడు బ్యాంకుల పరిధిలో అందుబాటులో ఉంటారని తెలియజేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top