పొగాకు గోడౌన్‌లో అగ్ని ప్రమాదం | Fire accident in Tobacco Godown | Sakshi
Sakshi News home page

పొగాకు గోడౌన్‌లో అగ్ని ప్రమాదం

Aug 15 2013 2:49 AM | Updated on Sep 5 2018 9:45 PM

పొగాకు గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ.25 లక్షల మేర పొగాకు సూర కాలిపోయింది.

పెదకాకాని,న్యూస్‌లైన్ : పొగాకు గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ.25 లక్షల మేర పొగాకు సూర కాలిపోయింది. మండల కేంద్రమైన పెదకాకాని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లేదారిలో మహాలక్ష్మి టుబాకో కంపెనీని 20 ఏళ్లుగా గుంటూరుకు చెందిన కాంతిలాల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. కంపెనీ యజమాని తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం ఆరు గంటలకు గోడౌన్ నుంచి పొగలు వస్తున్నాయని కంపెనీ వాచ్‌మన్ ఫోన్ చేయడంతో అక్కడకు వచ్చేసరికే గోడౌన్ అంతా దట్టమైన పొగలు కమ్మేశాయని తెలిపారు. 
 
 వెంటనే అగ్నిమాపక శాఖ వారికి ఫోన్లు చేశామని, వారు వచ్చేటప్పటికే  పెద్దపెద్ద మంటలు వ్యాపించాయన్నారు. గోడౌన్‌లో ఉన్న సరుకు విలువ సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఉంటుందని తెలిపారు.   మంటలు ఎలా వ్యాపించాయో తెలియదన్నారు. దీనిపై అగ్నిమాపక శాఖ అధికారి పీఎస్ రామకృషారావు మాట్లాడుతూ గోడౌన్‌లో ఎటువంటి అగ్నిప్రమాద నివారణ చర్యలు తీసుకోలేదని, కనీసం అందుబాటులో నీటి వసతి కూడా లేదన్నారు. ప్రమాద కారణాలు  దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. సంఘటనా స్థలానికి పెదకాకాని సీఐ కె శ్రీనివాసరావు చేరుకుని కనీసం కంపెనీ పేరుతో కూడిన బోర్డు కూడా పెట్టకుండా ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. గోడౌన్‌కు గోడౌన్‌కు మధ్య కనీసం ఖాళీ కూడా లేదని అగ్నిప్రమాదాలు జరిగినప్పడు నియంత్రించేందుకు కూడా వీలులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement