అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో 26 మంది దుర్మరణం | Fire accident in Nanded-Bangalore Express Train..26 Killed | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో 26 మంది దుర్మరణం

Dec 28 2013 7:45 AM | Updated on Jun 1 2018 8:39 PM

నాందేడ్-బెంగళూర్ ఎక్స్ప్రెస్లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

అనంతపురం: నాందేడ్-బెంగళూర్ ఎక్స్ప్రెస్లో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ఐదుగురు చిన్నారుల సహా 26మంది సజీ వదహనమైయ్యారు. మరో 10మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బి-1 ఏసీ బోగీ పూర్తిగా దగ్ధమైంది. మరో బోగీ పాక్షికంగా దగ్ధమైంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి రైల్వే స్టేషన్ల మధ్య రైల్లో మంటలు వ్యాపించాయి. రైల్లోని ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీ బోగీ బి వన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోగీలోని వారందరూ మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.

ఈ విషయాన్ని గమనించిన అధికారులు రైలును పుట్టపర్తి రైల్వే స్టేషన్ లో ఆపివేసి ఏసీ బోగీల లింక్ను తొలగించారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మంటలు రెండో బోగీకి వ్యాపించాయి. ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. రెండు బోగీల్లో 72 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరణించిన 15 మంది మృత దేహాలను వెలుపలికి తీశారు. మరికొంతమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. కొందరు ప్రయాణికులు బోగీలో చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ప్రయాణికుల్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో 12మంది మహిళలు, 12మంది పురుషులు ఉండగా, చిన్నారులు ఇద్దరు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  మృతుల్లో ఒకరు గణేష్‌ హైదరాబాద్‌ నగరానికి చెందినవాడు కాగా,  సర్వమంగళి, బసవరాజు ఇరువురు ఆదోని ప్రాంతానికి చెందినవారు. అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి ముంబాయికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పురుషులలో మధు, రాంప్రసాద్‌, అనిల్‌ కులకర్ణి, మహిళలలో లలిత, పద్మజలు బెంగళూరు ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను తీసుకెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇక ధర్మవరం స్టేషన్ నుంచి సహాయ సిబ్బందిని తీసుకుని ప్రత్యేక రైలు ప్రమాద స్థలానికి బయల్దేరి వెళ్లింది. సమీపంలోని పుట్టపర్తి, ధర్మవరం ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులను ధర్మవరం, పుట్టపర్తి ఆస్పత్రులకు తరలించారు. బోగీల నుంచి ప్రయాణికులు దిగేయడంతో ప్రాణ నష్టం కొంతవరకు తగ్గింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, రైలు ప్రమాద ఘటన సమాచారం అందిన వెంటనే మూడు ఫొరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలికి బయలుదేరాయి. మృతుల డీఎన్‌ఏ, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఫొరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించనున్నట్టు సమాచారం.

రైలు ప్రమాద హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లు

సికింద్రాబాద్‌ హెల్ప్‌లైన్‌: 040-27700868, 9701371060, వికారాబాద్‌ హెల్ప్‌లైన్‌: 08416-252215, 9701371081, ధర్మవరం హెల్ప్‌లైన్‌: 08559 224422, గుంతకల్లు హెల్ప్‌లైన్‌: 0855 2220305, 09701374965, అనంతపురం హెల్ప్‌లైన్‌: 09491221390, సేదమ్‌ హెల్ప్‌లైన్‌: 08441-276066, బీదర్‌ హెల్ప్‌లైన్‌ 08482-226404, 7760998400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement