కంటైనర్‌ టెర్మినల్‌లో అగ్ని ప్రమాదం

Fire Accident On Container In Visakhapatnam - Sakshi

రెండు కంటైనర్లు, ఓ భారీ క్రేన్‌ దగ్ధం

రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం

సాక్షి, విశాఖపట్నం: విమాన్‌నగర్‌లోని కంటైనర్‌ టెర్మినల్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు కంటైనర్లు, ఓ భారీ క్రేన్‌ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 3.5 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా. కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్విందర్‌ యాదవ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విమాన్‌నగర్‌లోని టెర్మినల్‌లో కంటైనర్లను ఒకదానిపై మరొకటిని క్రేన్‌ సహాయంతో పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ కంటైనర్‌ను మరోదానిపై పెడుతుండగా క్రేన్‌లో ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. గమనించిన క్రేన్‌ డ్రైవర్‌ వెంటనే కిందకి దిగి పారిపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

క్రేన్‌కు ముందు ఉన్న టైర్లకు మంటలు అంటుకుని, కంటైనర్లకు కూడా వ్యాపించాయి. దీంతో సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. వెంటనే మర్రిపాలెం, స్టీల్‌ ప్లాంట్, పోర్టు, ఆటోనగర్‌లోని అగ్నిమాపక కేంద్రాల నుంచి ఐదు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. అయితే క్రేన్‌కు ఉన్న హైడ్రాలిక్‌ ఆయిల్‌ ట్యాంక్‌కు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది వచ్చి పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ 3.5 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లందని సీజీఎం ఎల్విందర్‌ తెలిపారు. దగ్ధమైన క్రేన్‌ ధర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడం ఇదే ప్రథమమని చెప్పారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఏం జరిగిందోనని స్థానికులు కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద గుమిగూడారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top