ఫి(ని)ష్! | finish | Sakshi
Sakshi News home page

ఫి(ని)ష్!

Dec 18 2013 2:58 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఫి(ని)ష్! - Sakshi

ఫి(ని)ష్!

ఇది అక్రమ వేటగాళ్ల నుంచి మత్స్య శాఖ అధికారుల వరకూ అందరికీ తెలిసి సాగుతున్న ‘పచ్చి’ అక్రమ వ్యాపారం. కళ్లెదుటే సాగుతున్న ఈ దందాను అధికారులు చూసీచూడనట్లున్నారు.

ఇది అక్రమ వేటగాళ్ల నుంచి మత్స్య శాఖ అధికారుల వరకూ అందరికీ తెలిసి సాగుతున్న ‘పచ్చి’ అక్రమ వ్యాపారం. కళ్లెదుటే సాగుతున్న ఈ దందాను అధికారులు చూసీచూడనట్లున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వేటగాళ్లను రప్పించి యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగించడం కొందరు ‘దొంగ’ వ్యాపారులకు నిత్యకృత్యమైంది.
 
 సాక్షి, కడప:  ఒంటిమిట్ట మండలం కుడమలూరు బ్యాక్‌వాటర్‌లో చేపలవేట సాగుతోంది. కొందరు సొసైటీగా ఏర్పడి హైకోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకుని చేపల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ కొందరు నిబంధనలకు విరుద్ధంగా చేపల అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. నిబంధనల మేరకు అలివి వలతో చేపలు పట్టకూడదు. ఈ వలతో పడితే చిన్నచేపలు చిక్కుతాయి. దీంతో చేపల ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. అందువల్ల అలివి వలను ప్రభుత్వం నిషేధించింది. అయితే ఇక్కడ కొందరు అక్రమ వ్యాపారులు అలివి వలను ఉపయోగించి వేటను సాగిస్తున్నారు. చిన్నచేపలను వదలకుండా వాటిని ఎండబెట్టి  ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు.  
 
 రోజూ రూ.లక్షల్లో వ్యాపారం:
 కుడమలూరు బ్యాక్‌వాటర్‌లో చేపలను పట్టేందుకు కాకినాడ, వైజాగ్, కలువాయి తదితర ప్రాంతాల నుంచి జాలర్లను రప్పిస్తారు. రోజూ 2-3 టన్నుల చేపలను పట్టి ఎగుమతులు చేస్తారు. సొసైటీ సభ్యుల నుంచి కిలో 30-60రూపాయల(రకాలను బట్టి)కు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు మాత్రం కిలో 100-200 రూపాయల వరకూ విక్రయిస్తారు. ఇలా రోజూ రెండు లక్షల రూపాయల వ్యాపారం ఇక్కడ సాగుతోంది.
 
 అలివి వలతో పట్టడం వల్ల దొరికే చిన్నచేపలను ఎండబెడతారు. పచ్చిచేపలను కలకత్తాకు, ఎండుచేపలను విజయవాడకు ఎగుమతి చేస్తారు. రొయ్యలైతే నెల్లూరుకు సరఫరా చేస్తారు. ఈ వ్యవహారం సొసైటీ సభ్యులకు సంబంధం లేకుండా కొందరు రాజకీయ నేతల అండతో సాగిస్తున్నారు. దీంతో తాము కూడా నిబంధనలను బేఖాతరు చేస్తే ఏంటని కొందరు సొసైటీ సభ్యులు కూడా అలివి వలను వినియోగిస్తున్నట్లు తెలిసింది.
 
 అధికారులకు తెలిసే తతంగం:
 అక్కడ జరిగే అక్రమ చేపల వ్యాపారం ఓ చేపల అభివృద్ధి అధికారి కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుస్తోంది. వ్యాపారుల నుంచి ఈయనకు ప్రతి నెలా మామూళ్లు అందుతాయని, అందుకే అతను ఈ ప్రాంతంలో ఏం జరిగినా పట్టించుకోరనే విమర్శలున్నాయి. ఇటీవల కొంత మొత్తం తీసుకున్నారనే ఆరోపణలపై ఇతనిపై విచారణ కూడా నడుస్తోందని సమాచారం. చేపల అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులే అక్రమ వ్యాపారానికి అండగా నిలిస్తే ఎలా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇక్కడ చేపల తూకానికి పాతరకం రాళ్లను వినియోగిస్తున్నారు. తూనికలు, కొలతలశాఖ ఆమోదంతో ఉన్నవి కాదు.  సొసైటీ సభ్యులకు అన్యాయం జరుగుతోంది.
 
 నివారిస్తాం...:
 హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకుని చేపలు పడుతున్నారు. అయితే అలివి వలను వినియోగించడం, చిన్నచేపలను పట్టడం నిషేధం. ఇటీవల నేను వెళ్లి పరిశీలించి వచ్చాను. నాకు అలివి వలలు కనపడలేదు. నాకు ముడుపులు అందుతున్నాయనేది వాస్తవం కాదు. అక్రమవేట నివారణకు చర్యలు తీసుకుంటాం.
 
 రెడ్డయ్య, ఎఫ్‌డీఓ(చేపల అభివృద్ధి అధికారి)
 తక్షణ చర్యలు తీసుకుంటాం:
 అలివి వలల వినియోగం, చిన్నచేపలు పట్టడం, అక్రమ జాలర్లు రావడం నా దృష్టికి వచ్చింది. ఇదే విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ వ్యాపారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తక్షణ నివారణ చర్యలు తీసుకుంటాం.
  -హీరానాయక్, ఏడీ, మత్స్యశాఖ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement