ఎన్నికలంటే దడ | Fibrillation for elections | Sakshi
Sakshi News home page

ఎన్నికలంటే దడ

Sep 13 2015 3:04 AM | Updated on Aug 10 2018 8:16 PM

ఎన్నికలంటే దడ - Sakshi

ఎన్నికలంటే దడ

నీటి వినియోగదారుల సంఘం డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీలు ఇలా పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ జనరల్ బాడీ సమావేశాలను

సమావేశాలుగా పేరు మార్పు
11రోజుల్లో రెండు జీవోలు
 నీటి సంఘాల ఆధిపత్యం కోసం అధికారులతో తెలుగుతమ్ముళ్ల లాలూచీ

 
 రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న నీటి సంఘాల ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేని తెలుగు తమ్ముళ్లు అడ్డదారిలో ఆధిపత్యం కోసం తంటాలు పడుతున్నారు. నేరుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే తమ్ముళ్ల ఆధిపత్యం గల్లంతవుతుందనో, లేక రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భయపడ్డారో.. కారణం ఏదేతైనేమి నేరుగా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ధైర్య సాహసాలు చేయలేకపోయారనడానికి ఇదో నిదర్శనం.
 
 ఆత్మకూరు : నీటి వినియోగదారుల సంఘం డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్ట్ కమిటీలు ఇలా పలు కమిటీలను ఏర్పాటు చేస్తూ జనరల్ బాడీ సమావేశాలను నిర్వహిస్తున్నామంటూ ప్రభుత్వం ఇటీవల రెండు జీవోలకు శ్రీకారం చుట్టింది. గత నెల 13న జీవో ఆర్‌టీ నంబరు 528ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలో 6,138 నీటి వినియోగదారుల సంఘాలు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్ట్ కమిటీలకు ప్రతినిధులను నియమించుకునేందుకు ఆ జీవోలో వ్యూహరచన చేశారు. జనరల్ బాడీ సమావేశాలను ఏర్పాటుచేసి ఆ సమావేశాల ద్వారా చైర్మన్, వైస్‌చైర్మన్, మరో నలుగురు కమిటీ సభ్యులను ఈ నెల 12లోపు ఎన్నుకోవాలని ఆదేశించారు.

అయితే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలంటే ఈ సమయం సరిపోదని, జిల్లా కలెక్టర్లు సైతం ఈ గడువు పొడిగించాలని కోరారు. దీంతో ఈ గడువును ఈ నెల 25 వరకు పొడిగిస్తూ మరో జీవో 548ని గత నెల 24న విడుదల చేశారు. ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ జీవోను రూపొందించారు. మొత్తం మీద 11 రోజుల వ్యవధిలో రెండు జీవోలతో తెలుగుతమ్ముళ్లు ఆధిపత్యం చెలాయించే తరహాలో ఈ నీటి సంఘాల తంతు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలోనూ తెలుగుతమ్ముళ్లు ఎవరికి వారు ఈ జీవోలను ఆధారంగా చేసుకుని చైర్మన్, వైస్‌చైర్మన్‌లతో పాటు నలుగురు సభ్యులను ఎంపిక చేసుకునేందుకు కమిటీల సమావేశాలను ఈ నెల 13 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

 తప్పుల తడకగా ఓటర్ల జాబితాలు
 వాస్తవానికి వారం ముందే ఎన్నికల ప్రక్రియపై ఆయా నీటి సంఘాల పరిధిలో అవగాహన కల్పించడం, ఒక రోజు ముందు దండోరా వేయడం లాంటి ప్రక్రియలు కొనసాగాలి. అయితే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఈ ప్రక్రియలు లాంఛనమే అయ్యాయి. ఓటర్ల జాబితా సైతం తప్పుల తడకలుగా ఉన్నప్పటికీ ఈ అంశాలేవి అధికారులకు పట్టినట్లు లేవు. జిల్లా కలెక్టర్ నియమించిన ఓ అధికారి జనరల్ బాడీ సమావేశం పేరుతో ఓటర్లను సమావేశపరిచి వారి ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ ముసాయిదాను తెలుగు తమ్ముళ్లు రూపొందించుకున్నారనేది సమాచారం.

ఉదాహరణకు ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ తరహాలో 74 కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆత్మకూరు మండలంలో 9, చేజర్లలో 13, ఏఎస్‌పేటలో 14, అనంతసాగరంలో 14, మర్రిపాడులో 18, సంగం మండలంలో ఆరు కమిటీలు ఏర్పాటు కానున్నాయి. అధికారులతో తెలుగు తమ్ముళ్లు లాలూచీ పడి ఆధిపత్య పోరులో తమకే మద్దతు పలకాలంటూ అధికారులను సైతం తెలుగుతమ్ముళ్లు లోబరుచుకుంటున్నారు.

పేరుకు జనరల్ బాడీ సమావేశాలు అయినప్పటికీ పేరు మార్పు తప్ప అవి ఎన్నికలేనని పలువురు చర్చించుకుంటున్నారు. నేరుగా ఎన్నికలతో సమరం చేయలేక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేసిన ఎత్తుగడలో ఇదో భాగమని సర్వత్రా సాగుతున్న చర్చ. మరీ ఈ సమావేశాల్లో అధికారులు ఏ తరహాలో నిజాయితీకి కట్టుబడి ఉంటారో వేచి చూడాలి. వాస్తవంగా రైతులకు పట్టం గట్టేలా ఈ కమిటీలు ఏర్పాటు అయితే ఆశించినంత పరిణామమేనని పలువురు మేధావులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement