కుప్పం : ప్రాజెక్టుపై రైతుల నిరసన

Farmers Protest Against kuppam Airstript Project - Sakshi

కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌స్ట్రిప్ట్‌ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం వల్ల స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించినా ఇంతవరకు నిర్మాణం చేపట్టలేదు. ఈ క్రమంలో రైతులు సమష్టిగా ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది అధికారులకూ తలనొప్పిగా మారింది.

సాక్షి, కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతుల నుంచి భూములు సేకరించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.5లక్షల పరిహారంగా ప్రకటించింది. దీన్ని కొందరు రైతులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేతలు రంగంలోకి దిగి బలవంతపు భూసేకరణకు ఉపక్రమించారు. అడిగిన వెంటనే భూములు అప్పగిస్తే రూ.5లక్షలు ఇస్తామని లేకుంటే రూ.2లక్షలే వస్తుందని తప్పుదోవ పట్టించారు. దీంతో కొందరు రైతులు పాసుపుస్తకాలను ప్రభుత్వానికి అందించారు. మరికొందరు ఇవ్వలేదు. 432 ఎకరాలను రైతుల నుంచి గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టలేదు. ఇన్ని రోజులు టీడీపీ నేతలకు భయపడిన రైతులు ప్రస్తుతం సమష్టిగా ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అధికారులకు, రైతులకు మధ్య అంతరం
ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణంలో భాగంగా ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఇంజినీరింగ్‌ అధికారులు స్థానిక ప్రభుత్వ డిప్యూటీ సర్వేయర్‌ సురేష్‌ను వెంట పెట్టుకుని ఎయిర్‌స్ట్రిప్ట్‌ భూములను పరిశీలించడానికి గతవారం కడిసినకుప్పం గ్రామానికి వెళ్లారు. ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణానికి తాము పూర్తిగా వ్యతిరేకమని, ఇక్కడ ఎలాంటి స్థల పరిశీలనలు, కొలతలు చేపట్టకూడదని స్థానిక రైతులు అధికారులకు తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. రైతులకు, అధికారులకు మధ్య వివాదం మరింత ముదిరింది. అధికారులపై దాడికి పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని ప్రభుత్వ అధికారుల సంఘం డిమాండ్‌ చేస్తుండగా, మరోవైపు అధికారి మీద చర్యలు తీసుకోవాలని రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనా ప్రశాంత వాతావరణంలో చేపట్టాల్సిన ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

డబ్బులు వద్దు.. భూములు కావాలి
తమ బ్యాంకు ఖాతాల్లో వేసిన నగదును తిరిగి ఇచ్చేస్తామని, ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్మాణం కోసం బలవంతంగా లాక్కొన్న భూములు ఇచ్చేయాలని కడిసినకుప్పం, అమ్మవారిపేట, మణీంద్రం, విజలాపురం గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు. వైఎస్సార్‌ సీపీ రామకుప్పం మండల కన్వీనర్‌ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్వంలో రైతులు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ వ్యవహారాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చంద్రారెడ్డి, సూరి డాక్టర్, గంగయ్య, వెంకట్రామే గౌడు, రవినాయక్, పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top