కాసుల సాగు.. కనకాంబరం బాగు!

farmer Cultivation of flowers in ananthapuram - Sakshi

ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటనాయుడు

కనకాబంరం పూల సాగు.. రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది. గతంలో సంప్రదాయ పంటలు సాగు చేసి ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలను చవిచూసిన పలువురు రైతులు ప్రస్తుతం లభ్యమవుతున్న అరకొర నీటితో తక్కువ కాలంలో స్వల్ప పెట్టుబడులతో అధిక లాభాలను ఆర్జించే పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పూల సాగు చేపట్టిన రైతులు ఆర్థికంగా బలపడుతున్నారు.

నార్పల: మండలంలోని  రంగాపురం గ్రామానికి చెందిన రైతు వెంకటనాయుడు తనకున్న నాలుగు ఎకరాల్లో పంట సాగు కోసం 15 సంవత్సరాల క్రితం అప్పు చేసి నాలుగు బోర్లు వేయించారు. ఇందులో రెండు బోర్లలో నీటి జాడ కనిపించలేదు. మరో రెండు బోర్లలో అరకొరగా నీరు లభ్యమైంది. ఈ నీటితో నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల చొప్పున విడతల వారిగా కనకాంబం సాగు చేపట్టారు. ఆశించిన మేర దిగుబడులు సాధిస్తూ అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. పంట నాటినప్పటి నుంచి మూడేళ్ల పాటు దిగుబడిని ఇస్తోంది. వెంకటనాయుడిని ఆదర్శంగా తీసుకుని మండలంలోని నరసాపురం, రంగాపురం, దుగుమర్రి, కురగానపల్లి, కేశేపల్లి, గొల్లపల్లి, పప్పూరు, నార్పల తదితర గ్రామాల్లో 450 ఎకరాల్లో రైతులు కనకాబంరం సాగు చేపట్టారు.

పిల్లలకు ఉన్నత చదువులు
వెంకటనాయుడు, కళావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటునే కూతుళ్లకు గొప్ప చదువులు చెప్పించసాగాడు. ఆడపిల్లలకు అంత పెద్ద చదువులు ఎందుకంటూ బంధువులు, గ్రామస్తులు ఎద్దేవా చేస్తున్నా.. వెంకటనాయుడు దంపతులు తలొగ్గలేదు. ప్రధానంగా ఆడపిల్లలకు చదువే ఆధారమంటూ కూతుళ్లను ప్రోత్సహిస్తూ వచ్చారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా పెద్ద కుమార్తె సౌందర్య ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులోని హెచ్‌పీ కార్యాలయంలో సాఫ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. చిన్నమ్మాయి వీణ కూడా బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు రాజ్‌కుమార్‌ సైతం కర్ణాటకలోని ఉడుపి మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top