రూ.18 లక్షలు కడితే ఎంబీబీఎస్‌ సీటు

Fake MBBS Admission Seats Gang Arrested At Krishna District - Sakshi

కృష్ణా జిల్లా వాసికి టోకరా వేసిన కేటుగాళ్లు

రూ.14.45 లక్షలు సమర్పించుకున్న బాధితుడు

కోనేరు సెంటర్‌(మచిలీపట్నం): ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తామంటూ నమ్మబలికి, రూ.లక్షలు దండుకున్న ముగ్గురు ఘరానా మోసగాళ్లను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 13వ తేదీన బీహార్‌లో వారిని అదుపులోకి తీసుకుని, ఆదివారం మచిలీపట్నం తీసుకొచ్చారు. జిల్లా అడిషనల్‌ ఎస్పీ మోకా సత్తిబాబు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్‌లోని నోవాడా జిల్లా అప్పర్‌ గ్రామానికి చెందిన ఓంకార్‌ కుమార్, రాకేష్‌ కుమార్‌ అన్నదమ్ములు. రణధీర్‌ కుమార్‌ వీరికి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన ముగ్గురు ఆన్‌లైన్‌ మోసాలకు తెరలేపారు. మచిలీపట్నం మాచవరానికి చెందిన కట్టా మోహన్‌రావుకు నాలుగు నెలల క్రితం ముగ్గురు ఫోన్‌ చేశారు. మీ కుమారుడికి కోల్‌కతాలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సిద్ధంగా ఉందని, రూ.18 లక్షలు కడితే చాలంటూ నమ్మించారు.

తన కుమారుడిని ఎలాగైనా డాక్టర్‌ చదివించాలనే ఉద్దేశంతో మోహన్‌రావు ఆగష్టు 17న రూ.45,000 వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. 21న మరో రూ.4,50,000, 26న రూ.4,50,000 బదిలీ చేశాడు. 30వ తేదీన మళ్లీ రూ.5 లక్షలు పంపించాడు. మొత్తం రూ.14,45,000 వారి ఖాతాలో జమ చేశాడు. సెప్టెంబరు 9న తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కోల్‌కతాలోని నేషనల్‌ మెడికల్‌ కాలేజీకి వెళ్లాడు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడగా, తమ కళాశాలలో సీట్లు లేవని, మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పారు. మోహన్‌రావు సెప్టెంబరు 11న చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకులు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్‌ 13న బీహార్‌లోని ఓర్మిలీఘంజ్‌ బస్టాండ్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు యువకులు మచిలీపట్నంతో పాటు చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసగించి, రూ.లక్షలు దోచుకున్నట్లు తేలిందని ఏఎస్పీ చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top