పులివెందుల పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించిన రూ.53లక్షల దారి దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
దోపిడీలో కన్సల్టెంట్ సిబ్బంది పాత్ర
* గతంలోనూ కొన్ని లక్షలు స్వాహా
* కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
పులివెందుల: పులివెందుల పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించిన రూ.53లక్షల దారి దోపిడీ కేసు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దోపిడీలో క్యాష్ కన్సల్టెంట్ సంస్థ సిబ్బంది విక్రమ్, శ్రీనివాసుల పాత్ర ఉందని పోలీసు లు గుర్తించినట్లు తెలుస్తోంది. కన్సల్టెంట్ సిబ్బంది మరి కొందరితో కలిసి ఈ హైడ్రామా ఆడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
గతంలో కూడా వీరు ఏటీఎంలలో డబ్బు ఉంచేటప్పుడు మరికొన్ని లక్షలు స్వాహా చేసి ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడినట్లు పోలీసులతో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కన్సల్టెంట్ సిబ్బందితోపాటు ఇందులో పాలు పంచుకున్న ఇతర నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ నవీన్ గులాఠి అప్పటికప్పుడు కేసు విచారణకు సీసీఎస్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. కన్సల్టెంట్ సిబ్బందిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. వారు అసలు విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దోపిడీతో సంబంధమున్న ఇతర నిందితులను కూడా అరెస్టు చేసి దోపిడీ సొమ్మును రికవరీ చేసి ఎస్పీ సమక్షంలో మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.