వెలుగు రేఖ.. విశాఖ

Expert Committee Suggests Visakhapatnam As Executive Capital - Sakshi

విశ్వనగరానికి జీఎన్‌రావు కమిటీ పెద్దపీట

మౌలిక, భౌగోళికాంశాలు అనుకూలంగా ఉన్నాయని వెల్లడి

కీలకమైన వ్యవస్థలు  ఇక్కడే ఏర్పాటుకు సూచన

ప్రాంతీయ అసమానతలకు ఇక చెల్లుచీటి

కమిటీ సూచనలకు సర్వత్రా హర్షామోదాలు 

అందరి మొగ్గు విశాఖవైపే.. అందరి చూపు అందాల నగరిపైనే.. గత కొన్నేళ్ల నుంచి ఆర్థిక రాజధానిగా.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలకు వేదికగా మారిన విశాఖకు రాజధాని కావడానికి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన నాటి నుంచీ సర్వత్రా వినిపిస్తున్న మాట. తాజాగా ఈ అంశంపై నియమించిన జీఎన్‌రావు కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో వెల్లడించిన మూడు రాజధానుల ఆలోచన.. ఇప్పుడు నిపుణుల కమిటీ విశాఖ వైపు మొగ్గు చూపుతూ చేసిన సిఫారసులు.. విశాఖతో పాటు మొత్తం ఉత్తరాంధ్రకు మహర్దశ కల్పిస్తాయని ఈ ప్రాంత రాజకీయ పార్టీలు, మేధావులు, సామాన్యులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వనరులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు విశాఖకు రాజధాని యోగ్యత కల్పించేందుకు అనుకూలంగా ఉన్నాయన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు తగినట్లే నిపుణుల కమిటీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలని సూచించింది.

సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తు విశాఖదే. అందమైన నగరాన్ని చూసి ముగ్ధులైన ఎంతోమంది మహామహుల మాట ఇదే. దశాబ్దాలుగా ఈ మాట వింటున్నామే తప్ప విశాఖ సహా ఉత్తరాంధ్రకు సమన్యాయం దక్కట్లేదని సగటు విశాఖ వాసుల అసంతృప్తి మాటల్లో చెప్పలేనిది. విశాఖను విశ్వపటంలో ఆవిష్కరిస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన గత పాలకులకు భిన్నమైన పాలన ఇప్పుడు వచ్చింది. సమన్యాయం చేస్తానన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పాలన పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లలోనే ఒక్కొక్క అడుగూ విశాఖ అభివృద్ధి వైపు వడివడిగా వేస్తున్నారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఆయన నిర్ణయాలకు బలం చేకూర్చింది. ప్రాంతీయ అసమానతలను పారదోలేలా పలు సిఫారసులు చేసింది. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్య వస్థలకు విశాఖను కూడా ఒక వేదిక చేయాలనే సూచనలతో నివేదిక సమర్పించింది.

సహజ వనరులకు ఆటపట్టు..
సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్‌ వంటి అనుసంధాన మార్గాలే కాదు.. ఒక రాజధానికి ఉండాల్సిన సహజ సిద్ధమైన లక్షణాలన్నీ విశాఖకు ఉన్నాయనేది మేధావుల అభిప్రాయం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా అవతరించింది. తాజాగా జీఎన్‌ రావు కమిటీ పలు అంశాల్లో విశాఖకు పెద్దపీట వేసింది. ప్రాంతాల మధ్య సమతూకం, సమానాభివృద్ధే కొలమానంగా రూపొందించిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది. ఈ సిఫారసుల పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.

హైకోర్టు బెంచ్‌..
రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినపుడు కనీసం విశాఖలో హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు గట్టిగా కోరుకున్నారు. న్యాయవాదులు ఏకంగా ఉద్యమాలే నడిపారు. ఇప్పుడు జీఎన్‌ రావు కమిటీ కూడా అనూహ్యమైన సిఫారసులు చేసింది. శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, దాని బెంచ్‌లను అమరావతి, విశాఖలలో నెలకొల్పాలని సూచించింది. ఇది ఒక్క విశాఖకే కాదు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ మేలు చేసే సూచన అనేది మేధావుల అభిప్రాయం.

పాలనా నిలయం
పాలనలో అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ (సచివాలయం), ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌లోనే ఉండాలనే జీఎన్‌ రావు కమిటీ సిఫారసుపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలనకు విశాఖ వేదిక అయితే సర్వతోముఖాభివృది్ధకి నోచుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సాకారమైతే విశాఖలో మౌలిక వసతులు మరింత మెరుగవుతాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తరలివస్తాయి. వ్యాపార రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. 

అసెంబ్లీ సమావేశాలు
మహారాష్ట్ర మాదిరిగా శాసన వ్యవస్థ అటు అమరావతిలో, ఇటు విశాఖలో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలనే జీఎన్‌ రావు కమిటీ సిఫారసు కూడా ఇదే. ఇవన్నీ సాకారమైతే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. ప్రపంచపటంలో తలెత్తుకుని విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందనే వాదనల్లో సందేహమే అక్కర్లేదు. త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో నిపుణుల కమిటీ సూచనలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి 
అభివృద్ధిలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించిన నాలుగు మండళ్లలో ఇదొకటి. దీన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు గట్టి మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కమిటీ సూచనల్లో కొన్ని
⇒కార్యనిర్వాహక వ్యవస్థ(సచివాలయం)
⇒హైకోర్టు బెంచ్‌
⇒సీఎం క్యాంపు కార్యాలయం
⇒అసెంబ్లీ వేసవి సమావేశాల నిర్వహణ
⇒ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top