పరీక్షల వేళ...ఎన్నికల గోల! | exams time elections | Sakshi
Sakshi News home page

పరీక్షల వేళ...ఎన్నికల గోల!

Mar 4 2014 3:15 AM | Updated on Aug 14 2018 9:04 PM

వార్షిక పరీక్షల సమయంలో ఎన్నికల గోల మొదలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్ : వార్షిక పరీక్షల సమయంలో ఎన్నికల గోల మొదలు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో దాదాపుగా ఇటు పదో తరగతి, అటు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్షలతో పాటు ఎన్నికలు కూడా తరుముకొస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన ప్రారంభమైంది.   సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల కొన్ని పాఠశాలల్లో సిలబస్ సరైన సమయంలో పూర్తికాలేదు. దీంతో విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్‌విడుదల చేయడంతో ఉపాధ్యాయులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా నేడోరేపో విడుదల కానుంది. దీంతో ఈ ఏడాది కూడా చదువులు చట్టబండలయ్యే పరిస్థితి దాపురించింది. జిల్లాలో ఉన్న సుమారు 12 వేల మంది ఉపాధ్యాయుల్లో గతంలో ఎక్కువ శాతం మందిని ఎన్నికల విధులకు వినియోగించేవారు. అయితే పరీక్షలుండడంతో ఎంతమంది పరీక్షలకు, ఎంతమందిని ఎన్నికలకు వినియోగించాలో అధికారులకు అర్ధంకావడం లేదు.
 
 అందరికీ ‘పరీక్షా’కాలం
 మార్చి నెల అంటేనే ‘పరీక్షా’కాలం. ఈ నెలలో ఇంటర్ పరీక్షలు ముగిసి, నెలాఖరులో పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నారుు. ఇదే సమయంలో ఆంధ్రా యూనివర్శిటీ డిగ్రీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ పరీక్షల సెమిస్ట్‌లు కూడా ప్రారంభమవుతాయి.  టెన్త్ పరీక్షలకు 28 వేల మందివిద్యార్థులు, ఇంటర్మీడియెట్ రెండు సంవత్సరాలు కలిపి 32 వేలమంది ఇలా సుమారు లక్ష మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.   ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలకు చెందిన సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉంది. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహిస్తుండడం వల్ల విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా అనుమానమే. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా నిమగ్నమై ఉంటారు. ఉపాధ్యా యులంతా పరీక్షల విధుల్లోనే ఉంటారు. వీరే ఎన్నికల విధులకు కూడా హాజరుకావాల్సి ఉంటుండడంతో  ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలలో అర్థంకాక అధికారులు మధనపడుతున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement