చిరుతిళ్లతో జర జాగ్రత్త! | Everyone snacks, beware! | Sakshi
Sakshi News home page

చిరుతిళ్లతో జర జాగ్రత్త!

Mar 7 2015 2:58 AM | Updated on Sep 2 2017 10:24 PM

వివిధ కంపెనీలకు చెందిన చిరుతిళ్లు కొద్ది రోజులుగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరైన న్యూట్రిషన్ నిపుణుల సలహాలు, సూచనలు లేకుండానే నాణ్యత లేని తినుబండారాలను ఆకర్షణీయంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు.

సాక్షి, కడప : గడువు మీరిన చిరుతిళ్లు తిని చిన్నారులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటున్నారు వైద్యులు. కమలాపురం మండల పరిధిలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులను ఫుడ్ పాయిజన్ కబళించింది. గురువారం ఉదయం మహీధర్ అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందితే, శుక్రవారం ఉదయం అతని సోదరి నవ్యశ్రీ మృత్యువాత పడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఈ పరిణామంతో జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులు పిల్లల చిరుతిండ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల గడువు దాటినా లాభాపేక్షతో కక్కుర్తిపడి వ్యాపారులు అంటగడుతున్నారు.
 
 ఇంట్లో ఆహార విషయంలో కూడా తల్లిదండ్రులు చిన్నారులను కనిపెట్టి పరిశీలిస్తూ ఉండాలని పలువురు వైద్యులు చూచిస్తున్నారు.  మధ్యాహ్న భోజన విషయంలో కూడా ప్రధానోపాధ్యాయులు దృష్టి సారించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన విషయంలో అటు అధికారులు, ఇటు పాఠశాల ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఇంటి వద్దనే ఆహారాన్ని వండి తీసుకు రావడం ఒక ఎత్తయితే, మరికొన్ని పాఠశాలల్లో వంటశాలలు లేక ఆరుబయట వంట చేస్తుండడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం, కట్టెలతో వంట చేయడం వల్ల కొన్ని వ్యర్థ పదార్థాలు ఆహారంలో కలవడం, ఆకు కూరలు, కూరగాయలు తాజాగా లేకపోవడం తదితర సమస్యలపై అప్రమత్తత అవసరం. పులివెందులలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
 
 మితిమీరిన చిరుతిళ్లు
 వివిధ కంపెనీలకు చెందిన చిరుతిళ్లు కొద్ది రోజులుగా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సరైన న్యూట్రిషన్ నిపుణుల సలహాలు, సూచనలు లేకుండానే నాణ్యత లేని తినుబండారాలను ఆకర్షణీయంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఎక్కువగా విక్రయించిన వ్యాపారులకు బహుమతులు ప్రకటిస్తూ  అడ్డగోలు ఆర్జనకు బరితెగిస్తున్నారు. చాలా కంపెనీలకు చెందిన చిరుతిళ్లు తిని పలువురు చిన్నారులు నిత్యం ఎక్కడో ఒక చోట అస్వస్థతకు గురువుతున్నారు. ఇలా అస్వస్థతకు గురైన వెంటనే వాంతులు, విరేచనాలతో చిన్నారులు నీరసించి పోతున్నారు. ఆ సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా విక్రయిస్తున్న చిరుతిండ్లపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఆ బాధ్యత మరిచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement