పీఎఫ్‌.. ఉఫ్‌!

Employees PF Money Transfer to Pasupu Kunkuma Scheme - Sakshi

రూ.3 కోట్ల సాధారణ నిధులు సైతం కేటాయింపు

ఎన్నికల తాయిలాల కోసం టీడీపీ ప్రభుత్వ నిర్వాకం

ప్రస్తుత నిల్వరూ. 90వేలు మాత్రమే

ఆందోళన చెందుతున్నఉద్యోగులు

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులను సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఎర వేసేందుకు అన్నిశాఖల నుంచి అడ్డగోలుగా నిధుల మళ్లించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్రతి నెలా తమ వేతనం నుంచి ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్మును (పీఎఫ్‌) సైతం దారిమళ్లించిన ఉదంతం వెలుగు చూసింది. ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం బహిర్గతమైంది. జిల్లా పరిషత్‌ (జెడ్పీ) ఉద్యోగుల పీఎఫ్‌ సొమ్మును సైతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.350 కోట్లు ఖాతా నుంచి
మాయమయ్యాయి.

సాక్షి, మచిలీపట్నం: జిల్లా పంచాయతీ (జెడ్పీ) పరిధిలో దాదాపు 10,090 మంది ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మరో 15,600 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం వారి స్థాయిని బట్టి వేతనాలుమంజూరు చేస్తుంది. వేతనాల్లో ప్రతి మాసం 10 శాతం నగదు పీఎఫ్‌గా కోత విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని ఉద్యోగం నుంచి రిటైర్డ్‌ అయిన అనంతరం కోత విధించిన సొమ్ముకు అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి సదరు ఉద్యోగికి అందజేస్తుంది. ఈ సొమ్మును సదరు ఉద్యోగులు వారి అత్యవసర అవసరాలకు రుణంగా పొందుతారు. అంతటి ప్రాధాన్యత కలిగిన సొమ్మును సైతం ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్యాలెన్స్‌ నిల్‌..
జిల్లా పంచాయతీ ఖాతా ఖాళీగా దర్శనమిస్తోంది. జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి రూ.350 కోట్లు సొమ్ము ఖాతాలో ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ.90,000 మాత్రమే దర్శనమిస్తోంది. ఇవి కాకుండా మరో రూ.3 కోట్ల మేర సాధారణ నిధులు సైతం కైంకర్యం చేశారు. ఎన్నికల సమయానికి కొద్ది రోజుల ముందు వరకు ఖాతాలో ఉన్న నిధులు ఒక్క సారిగా మాయం అయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది. దీనికి తోడు ఈ ఏడాది జనవరి నుంచి పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతి పంచాయతీ ఖాతాలో రూ.30 లక్షల మేర నిధులు ఉండాల్సి ఉండగా నేటికీ నయా పైసా రాని పరిస్థితి.

తిరిగి ఎప్పుడిస్తారో?
జెడ్పీ ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించి రూ.350 కోట్లు దారి మళ్లించారు. ఈ నిధులు తిరిగి ఎప్పుడు పీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తారన్న అంశంలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక కౌంటింగ్‌ కూడా పూర్తయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితే ఆ డబ్బును ఎవరు జమ చేస్తారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రుణాలు పెండింగ్‌..
ఉపాధ్యాయులు తమ అవసరాల రీత్యా పీఎఫ్‌ సొమ్ము నుంచి రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు, అనుమతుల ప్రక్రియ పూర్తయి నెలల గడుస్తున్నా నేటికీ నగదు అందిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 15,600 మంది ఉపాధ్యాయుల్లో దాదాపుగా 466 మంది వరకు రుణం పొందేందుకు నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.7 కోట్లకుపైగానే పెండింగ్‌ ఉండటం గమనార్హం.

ఎన్నికల తాయిలాలకు మళ్లింపు..
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని భావించిన టీడీపీ ప్రభుత్వం ఓటర్లకు ఎన్నికలకు ముందే తాయిలాల ఎర వేసింది. ఇందులో భాగంగా పుసుపు–కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేలు, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంపు, రైతు భరోసా తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటికి రూ.కోట్లల్లో చెల్లింపులు జరపాల్సి వచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఇతర శాఖల్లో ఉన్న నగదు మొత్తం వీటికే వెచ్చించింది. ఇదే తరుణంలో జెడ్పీ, ఉపాధ్యాయులు తమ వేతనంలో దాచుకున్న నగదును మాత్రం దారి మళ్లించింది. ఈ నిజం బయటపడకుండా రిజర్వు బ్యాంక్‌ పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేస్తూ వచ్చింది. ప్రస్తుతం బండారం బయట పడటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top