సౌదీలో వలస కూలీ మృతి | Employeement Worker Died In Saudi Arabia | Sakshi
Sakshi News home page

సౌదీలో వలస కూలీ మృతి

Nov 23 2018 7:16 AM | Updated on Nov 23 2018 7:16 AM

Employeement Worker Died In Saudi Arabia - Sakshi

రోదిస్తున్న మృతుని భార్య చంద్రమ్మ, కుటుంబసభ్యులు కొయ్య గోపాల్‌ (ఫైల్‌)

శ్రీకాకుళం, కంచిలి: పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన కూలీ పనిచేస్తున్న చోటే హఠాత్తుగా మృతిచెందాడు. ఈ ఘటన జరిగి 8 రోజులు పూర్తయినా ఇంతవరకు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించేందుకు అక్కడి కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. కనీసం ఫోన్‌లో కూడా సదరు ప్రతినిధులు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ ఆంధ్ర సరిహద్దులోని ఒడిశా రాష్ట్ర పరిధి గంజాం జిల్లా జరడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బనసోల గ్రామానికి చెందిన కొయ్య గోపాల్‌ విషాద గాథ. గోపాల్‌ కుటుంబం ఒడిశా పరిధిలో నివసిస్తున్నప్పటికీ వారి బంధుగణం అంతా ఆంధ్ర పరిధిలో ఉండటంతో రెండు చోట్ల ఉన్న ఆయా కుటుంబాలు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గోపాల్‌ తాత స్వగ్రామం కంచిలి మండలంలోని అంపురం పంచాయతీ పరిధి నరసన్నముకుందాపురం గ్రామం.

ఈ నెల 16న సౌదీలో ఎన్‌.ఎస్‌.హెచ్‌. కంపెనీలో గోపాల్‌ తన రూమ్‌లో బాత్‌రూమ్‌ వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచరులు ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యంతో చెప్పడంతో వారు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే గోపాల్‌ మృతిచెందాడు. కానీ ఈ సమాచారాన్ని కంపెనీ యాజమాన్యం కుటుంబసభ్యులకు తెలియజేయలేదు. అక్కడున్న మిగతా ఉద్యోగులు బాధితుని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీంతో గోపాల్‌ భార్య చంద్రమ్మ తన భర్త మృతదేహాన్ని పంపించడానికి అవసరమైన అఫిడవిట్‌ను సౌదీలో ఉన్న ఇండియన్‌ ఎంబసీకీ మెయిల్‌ చేశారు. 8 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు సౌదీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలోని జరడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు సాయం చేయాల్సిందిగా అభ్యర్థించినా వారేమీ చేయలేమని చేతులెత్తేశారు. తర్వాత భువనేశ్వర్‌లో ఉండే అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది.

మే నెలలో ఇద్దరు కుమారులు వివాహం..
గోపాల్‌  ఈ ఏడాది మే 11న తన ద్దరు కుమారులు అభి, కృష్ణలకు ఒకేసారి వివాహం జరిపించాడు. జూన్‌ 23న తిరిగి సౌదీ వెళ్లి ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

సాయిరాజ్‌ను కలిసిన మృతుని కుటుంబీకులు..
గోపాల్‌ మృతదేహాన్ని భారత్‌ రప్పించేందుకు మృతుని కుమారుడు అభిమన్యు తన మేనమామ నారద భీమారావుతో కలిసి ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ను కలిశారు. తమ పరిస్థితిని వివరించారు. సాయిరాజ్‌ వారి వద్ద నుంచి వివరాలు తీసుకొని సౌదీలో ఉన్న తనకు పరిచయస్తులతో సౌదీ ఇండియన్‌ యంబసీ ద్వారా మృతుడు పనిచేస్తున్న ఎన్‌ఎస్‌హెచ్‌ కంపెనీ ప్రతినిధి బ్రేవోతో మాట్లాడి, మృతదేహం జుబేల్‌ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని గుర్తించారు. గోపాల్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని, మరో 10 నుంచి 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సాయిరాజ్‌ తెలిపారు. కుటుంబ సభ్యులు దిగులు చెందొద్దని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement