breaking news
employment worker
-
ఒమాన్ ప్రభుత్వం షాక్.. ఉద్యోగాలకు కోత
ఎన్.చంద్రశేఖర్,మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): బల్దియా(మున్సిపాలిటీ)ల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ఒమాన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నేరుగా నియమించుకున్న కార్మికులను క్రమంగా తొలగిస్తోంది. వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు ఇప్పటికే ఇళ్లకు చేరుకోగా.. దశల వారీగా ఈ ఏడాది చివరి వరకు మరికొందరు ఇంటిముఖం పట్టనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనులను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించాలని ఒమాన్ ప్రభుత్వం మూడేళ్ల కిందనే నిర్ణయించింది. ఇటీవల ఒమాన్ రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో హైతమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం బల్దియా ప్రైవేటీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బల్దియా పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించగా.. ఆ ఏజెన్సీలు తక్కువ వేతనంపై పనిచేసేవారిని నియమించుకుంటున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనానికి పని చేసేందుకు ముందుకు రావడంతో వారినే పనుల్లోకి తీసుకుంటున్నారు. బల్దియాలో ఇది వరకు పనిచేసిన మన కార్మికులు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆశ్రయిస్తే.. తాము ఇచ్చే వేతనానికి అంగీకరిస్తేనే పనిలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తే శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఒమాన్ దేశంలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేసే విదేశీ కార్మికుల్లో 60 శాతం మంది కార్మికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం విశేషం. బల్దియాల ప్రైవేటీకరణతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల సంఖ్య దాదాపు లక్షకు మించి ఉంటుందని అంచనా. ఇందులో బల్దియాల్లో పని చేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం.. వేతనం కూడా ఆశించిన విధంగా ఉండటంతో మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఈ ఉద్యోగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. సుమారు 40 ఏళ్ల నుంచి బల్దియా ఉద్యోగాలకు వలసలు కొనసాగుతున్నాయి. కార్మికులు చేసే పనులు ఇవే... మస్కట్‌తో పాటు ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో మన కార్మికులు గార్డెనింగ్, క్లీనింగ్, విద్యుదీM్దý రణ, రోడ్ల పక్కన ఉన్న చెత్తా చెదారం ఏరివేయడం తదితర పనులను చేసేవారు. అలాగే కార్మికులను వారి నివాసం నుంచి మున్సిపాలిటీల్లోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా మనవారే ఉన్నారు. నిర్ణీత పనివేళలు ఉండటంతో పాటు నెలకు మన కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం లభించడంతో ఒమాన్ బల్దియాల్లో పనులకు డిమాండ్ ఏర్పడింది. ఒమాన్ ప్రభుత్వంలోని మున్సిపల్ వ్యవహారాల శాఖనే నేరుగా రిక్రూట్మెంట్ చేయడంతో.. కార్మికులు ఉద్యోగం మానివేస్తే గ్రాట్యూటీ కూడా ఎక్కువగా లభించేది. అలాగే ఏడాదికి నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు లభించేవి. ఈ సమయంలో కార్మికులు ఇంటికి వచ్చి వారి కుటుంబాలతో గడిపి వెళ్లేవారు. కొందరు కార్మికులు తమ పనివేళలు ముగిసిన తరువాత ఇతర పనులు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దక్కేది. ఒమాన్ బల్దియాల్లో వివిధ పనులు చేసే కార్మికులను ఎన్నో ఏళ్ల నుంచి నేరుగా నియమించుకుంటున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికిన అక్కడి ప్రభుత్వం అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ప్రైవేటీకరణను ముమ్మరం చేసింది. పెరిగిన పనివేళలు బల్దియాల్లో ప్రభుత్వం ద్వారా నియమించబడిన కార్మికులు రోజుకు 8 గంటల పాటు పనిచేసేవారు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పుడు పనివేళలను పెంచాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించాయి. గతంలో ఒక్కో కార్మికునికి భారత కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వేతనం లభించగా ఇప్పుడు రూ.20వేలకు మించి చెల్లించడం లేదు. పని వేళలు పెరగడంతో పాటు వేతనం తగ్గడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. స్వరాష్ట్రంలో ఉపాధి చూపాలంటున్న కార్మికులు ఒమాన్ బల్దియాల్లో ఉద్యోగాలను కోల్పోయి ఇంటి బాట పట్టిన తెలంగాణ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలోనే ఉపాధి మార్గాలను చూపాలని పలువురు కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బల్దియా వీసాలపై ఉపాధి పొందిన కార్మికులు ఒమాన్ ప్రభుత్వ నిర్ణయంతో ఇంటికి చేరుకుంటుండగా వారికి పునరావాసం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. మూడు రకాల వీసాలు రద్దు.. మున్సిపాలిటీల్లో మన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒమాన్ ప్రభుత్వం గతంలో జారీచేసిన మూడు రకాల వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా, సెవెన్ బల్దియా వీసా, దివాన్ బల్దియా వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా అంటే పట్టణం పరిధిలోనే పని చేయడం. సెవెన్ బల్దియా అంటే పట్టణ ప్రాంతానికి శివారుల్లో పనిచేయడం. దివాన్ బల్దియా వీసాలు ఉన్నవారు రాజు, మంత్రుల నివాసాల వద్ద పనిచేసేవారు. ఈ మూడు రకాల వీసాలను రద్దు చేసి.. అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు ఉపాధి దక్కకుండా పోతోంది. ఎనిమిదేళ్లు పనిచేశాను.. మస్కట్ బల్దియాలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశాను. గార్డెనింగ్ పనులను కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించడంతో మా వీసాలను రద్దుచేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ఉపాధి కోసం మరో గల్ఫ్ దేశానికి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒమాన్‌లో బల్దియా ప్రైవేటీకరణ కంటే ముందుగానే పరిస్థితి బాగుంది. కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పగించిన తరువాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.– డి.శ్రీకాంత్, మెండోరా,భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) ఉపాధి కోల్పోవడంబాధగా ఉంది.. ఒమాన్ బల్దియాలో పనిచేస్తున్న మాకు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం బాధగా ఉంది. ఎనిమిది సంవత్సరాలు బల్దియాలో పనిచేశాను. ఇప్పుడు వీసా రద్దుచేసి ఇంటికిపంపించారు. ఇక్కడ ఉపాధి లేకనే గల్ఫ్‌కు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.– రాజేష్, వేంపేట్, మెట్పల్లిమండలం(జగిత్యాల జిల్లా) ప్రభుత్వాలు స్పందించాలి.. ఒమాన్‌లో బల్దియాలో పనిచేసిన కార్మికులు వందల సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. రాజు ఖబూస్ బిన్ అల్ సయీద్ మరణించడంతో కొత్త రాజు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశంలో ప్రైవేటీకరణ ఊపందుకుంది.– జి.కృష్ణ, తిప్పాపూర్, వేములవాడమండలం(రాజన్న సిరిసిల్ల జిల్లా) ఏం చేయాలోఅర్థంకావడం లేదు.. స్థానికంగా పని లేకపోవడంతోనే మేము గల్ఫ్ దేశానికి వలస వెళ్లాం. అక్కడ కూడా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి కోల్పోయి ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైనా ఉపాధి చూపాలి. లేకుంటే మరో గల్ఫ్ దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి.– ప్రశాంత్, మెండోరా, భీమ్‌గల్ మండలం (నిజామాబాద్ జిల్లా) -
సౌదీలో వలస కూలీ మృతి
శ్రీకాకుళం, కంచిలి: పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం సౌదీకి వలస వెళ్లిన కూలీ పనిచేస్తున్న చోటే హఠాత్తుగా మృతిచెందాడు. ఈ ఘటన జరిగి 8 రోజులు పూర్తయినా ఇంతవరకు కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించేందుకు అక్కడి కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. కనీసం ఫోన్లో కూడా సదరు ప్రతినిధులు స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదీ ఆంధ్ర సరిహద్దులోని ఒడిశా రాష్ట్ర పరిధి గంజాం జిల్లా జరడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బనసోల గ్రామానికి చెందిన కొయ్య గోపాల్ విషాద గాథ. గోపాల్ కుటుంబం ఒడిశా పరిధిలో నివసిస్తున్నప్పటికీ వారి బంధుగణం అంతా ఆంధ్ర పరిధిలో ఉండటంతో రెండు చోట్ల ఉన్న ఆయా కుటుంబాలు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గోపాల్ తాత స్వగ్రామం కంచిలి మండలంలోని అంపురం పంచాయతీ పరిధి నరసన్నముకుందాపురం గ్రామం. ఈ నెల 16న సౌదీలో ఎన్.ఎస్.హెచ్. కంపెనీలో గోపాల్ తన రూమ్‌లో బాత్రూమ్ వద్ద అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న సహచరులు ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యంతో చెప్పడంతో వారు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే గోపాల్ మృతిచెందాడు. కానీ ఈ సమాచారాన్ని కంపెనీ యాజమాన్యం కుటుంబసభ్యులకు తెలియజేయలేదు. అక్కడున్న మిగతా ఉద్యోగులు బాధితుని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీంతో గోపాల్ భార్య చంద్రమ్మ తన భర్త మృతదేహాన్ని పంపించడానికి అవసరమైన అఫిడవిట్‌ను సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీకీ మెయిల్ చేశారు. 8 రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు సౌదీ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒడిశాలోని జరడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు సాయం చేయాల్సిందిగా అభ్యర్థించినా వారేమీ చేయలేమని చేతులెత్తేశారు. తర్వాత భువనేశ్వర్‌లో ఉండే అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మే నెలలో ఇద్దరు కుమారులు వివాహం.. గోపాల్ ఈ ఏడాది మే 11న తన ద్దరు కుమారులు అభి, కృష్ణలకు ఒకేసారి వివాహం జరిపించాడు. జూన్ 23న తిరిగి సౌదీ వెళ్లి ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాయిరాజ్‌ను కలిసిన మృతుని కుటుంబీకులు.. గోపాల్ మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు మృతుని కుమారుడు అభిమన్యు తన మేనమామ నారద భీమారావుతో కలిసి ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌ను కలిశారు. తమ పరిస్థితిని వివరించారు. సాయిరాజ్ వారి వద్ద నుంచి వివరాలు తీసుకొని సౌదీలో ఉన్న తనకు పరిచయస్తులతో సౌదీ ఇండియన్ యంబసీ ద్వారా మృతుడు పనిచేస్తున్న ఎన్ఎస్హెచ్ కంపెనీ ప్రతినిధి బ్రేవోతో మాట్లాడి, మృతదేహం జుబేల్ ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని గుర్తించారు. గోపాల్ మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడానికి అవసరమైన ప్రక్రియను ప్రారంభించామని, మరో 10 నుంచి 15 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని సాయిరాజ్ తెలిపారు. కుటుంబ సభ్యులు దిగులు చెందొద్దని చెప్పారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- ట్రాక్టర్ డ్రైవర్ అశ్రద్ధతో ఉపాధి కూలీ మృతి - చావుబతుకుల్లో మరొకరు.. గణపురం(వరంగల్ జిల్లా): ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలు బలిగొనగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గణపురం మండలం ధర్మారావుపేటలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు.. ధర్మారావుపేటలో జరుగుతున్న ఉపాధి పనుల్లో భాగంగా ట్రాక్టర్‌లోని మట్టిని బయటకు తరలించిన డ్రైవర్.. తిరిగి వస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కూలీలు కూర్చున్నవైపే రానిచ్చాడు. గమనించిన పలువురు కూలీలు తప్పించుకోగా విషయం తెలియని బాపని జయసుధ(28), జీడీ భాగ్యమ్మ అలాగే ఉండిపోయారు. దీంతో ట్రాక్టర్ వారి పైనుంచి వెళ్లగా జయసుధ తీవ్రంగా గాయపడింది. భాగ్యమ్మ రెండు కాళ్లు విరిగిపోయాయి. జయసుధ భర్త రవీందర్ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భర్త ఒడిలోనే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గణపురం ఎస్సై విజయ్‌కుమార్, తహసీల్దార్ జీవాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.