సార్వత్రికం సహా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ప్రతిష్టను పెంచినట్టు డీజీపీ ప్రసాదరావు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: సార్వత్రికం సహా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ప్రతిష్టను పెంచినట్టు డీజీపీ ప్రసాదరావు చెప్పారు. ఇందుకు కిందిస్థాయి కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు చేసిన సమష్టి కృషే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో ఆదివారం జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ప్రసాదరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీలు మొదలుకుని సీనియర్ ఐపీఎస్ వరకు వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికలు, మధ్యలో ఇతర ఉద్యమాలు, పండుగలకు పోలీసులు అలుపెరగకుండా కష్టపడి బందోబస్తు నిర్వహించారని కొనియాడారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులతో పోలీసు అధికారులు విరామం లేకుండా పనిచేశారన్నారు. గెట్ టుగెదర్‌లో రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ కౌముది, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ ఐపీఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.