ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమ అరెస్టులకు తెరతీసింది.
చాగలమర్రి, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ అధికార పార్టీ అక్రమ అరెస్టులకు తెరతీసింది. బలమైన అభ్యర్థులపై గెలవలేమనే భయంతో పాత కేసులను తిరగదోడుతూ సరికొత్త డ్రామాకు తెరతీస్తోంది. ఈ కోవలోనే చాగలమర్రి ఒకటో ఎంపీటీసీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న కొండుపల్లి మస్తాన్‌ను సోమవారం ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు. వైఎస్‌ఆర్ జిల్లా అటవీ సెక్షన్ అధికారి ఓబులేసు, ఆరుగురు సాయుధ సిబ్బందితో సోమవారం తెల్లవారుజామున చాగలమర్రికి చేరుకున్నారు. స్థానిక ఎస్‌ఐ గోపాల్‌రెడ్డిని కలసి మస్తాన్ అరెస్టు విషయమై చర్చించారు.
అనంతరం మస్తాన్ అరెస్టుకు యత్నించగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఫారెస్టు అధికారుల వాహనాన్ని నిలువరించి రోడ్డుపైనే బైఠాయించారు. వారెంట్ చూపించాలని పార్టీ నాయకులు రఘునాథ్‌రెడ్డి, నిజాముద్దీన్, అన్సర్‌బాషా, లక్ష్మిరెడ్డిలు ఫారెస్టు అధికారి ఓబులేసును కోరారు. అందుకాయన సమాధానమిస్తూ.. రాయచోటి ఫారెస్టు పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 2011లో మస్తాన్‌వలిపై రెండు కేసులు నమోదయ్యాయన్నారు.
ఈ కేసుల్లో అరెస్టుకు వారంట్‌తో పనిలేదన్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు మస్తాన్‌ను ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి ఫారెస్టు అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా మస్తాన్ విలేకరులతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం నేపథ్యంలోనే తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కేసులకు భయపడేది లేదని.. న్యాయపరంగానే కుట్రలను ఎదుర్కొంటానన్నారు. ప్రజలు నీచ రాజకీయాలను గమనిస్తున్నారని.. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు.