లబ్‌.. డబ్‌..

Election Countdown Has Started In Guntur - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు జిల్లా ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ జిల్లాలో ఎన్నికల వేడిని మరింత పెంచాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్‌ తమకు అనుకూలంగా లేకపోవడంతో కౌంటింగ్‌కు ముందే టీటీపీ అభ్యర్థులు డీలాపడ్డారు. జిల్లాలో ఒక్క సీటు కూడా తమకు వచ్చే పరిస్థితి లేదని తేలడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడు లయోలా హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి మరో 24 గంటల గడువే ఉంది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య 40 రోజులకు పైగా గడువు ఉండటంతో ఎన్నికల ఫలితాలపై ఇటు అభ్యర్థులు, అటు జిల్లా ప్రజలు తీవ్ర ఉత్కంఠ అనుభవించారు. రకరకాల సర్వేలు,  అంచనాలతోసతమతమయ్యారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదంటూ ప్రకటనలు గుప్పించారు.

పోలింగ్‌ ముందు నుంచి, అనంతరం గెలుపుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ధీమాగానే ఉన్నారు. వారిని ధీమాకు తగ్గట్టే ఇటీవల విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల్లో పలు జాతీయ సర్వే సంస్థలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పాయి. ఓటమిని ముందే ఉహించిన టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో విచ్చల విడిగా డబ్బు, మద్యం పంచి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ అంటూ రూ.10 వేలు వారి ఖాతాల్లో జమ చేయడంతోపాటు, పింఛన్ల పెంపు పేరిట ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలింగ్‌ ముగిశాక ఓటింగ్‌ సరళిని పరి శీలించిన టీడీపీ అభ్యర్థులు తమకు వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లు వేశారనే అంచనాకు వచ్చారు.

ప్రధానంగా టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, టీడీపీ నేతల అవినీతి, దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, మట్టి, ఇసుక మాఫియా దారుణాలు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపును దెబ్బతీశాయనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర, ప్రత్యేక హోదాపై చేసిన పోరా టాలు, ఆయన ప్రకటించిన నవరత్నాల వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి.

లగడపాటి సర్వేపై అనుమానాలు.
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వెల్ల డించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై అనుమానం ఉన్నట్లు టీడీపీ శ్రేణులే పేర్కొంటున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపునకు ముందే టీడీపీ అభ్యర్థులు డీలా పడ్డారు. పోలింగ్‌ ముగిసినప్పటి నుంచి ఓటమి తప్పదనే అంచనాకు వచ్చిన టీడీపీ నాయకులు ఈవీఎంలు, ఎన్నికల కమి షన్‌పై ఆరోపణలు చేస్తూ నానాయాగీ సృష్టిస్తున్నారు. లగడపాటితో పాటు, కొన్ని సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌ టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ శ్రేణులు నమ్మడంలేదు.

కౌటింగ్‌కు ముందే తమ అభ్యర్థులు చేతులు ఎత్తేయకుండా టీడీపీ అధిష్టానమే కొన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉండేలా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసినా ఓటమి తప్పదనే భావన టీడీపీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. జిల్లాలో జనసేన పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేలడంతో ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యం ఆవహించింది. 

తుది దశకు చేరిన కౌంటింగ్‌ ఏర్పాట్లు
గురువారం జరిగే కౌంటింగ్‌ సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నల్లపాడులయోలా హైస్కూల్‌లో ఏర్పాట్లు పూర్త య్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర కోన శశిధర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో బుధవారం మాక్‌ కౌంటింగ్‌ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం నుంచే కౌటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి రౌండ్‌లో సువిధ యాప్‌ ద్వారా ఫలితాలు వెల్లడిం చేందుకు ఎన్నికల కమిషన్‌ అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. సువిధ యాప్‌లో ఫలి తాలు నమోదుపై ఆర్వోలకు మంగళవారం అవగాహన కల్పించారు. బుధవారం సాయంత్రానికే  కౌంటింగ్‌ ఏజెంట్లు గుంటూరు నగరానికి చేరుకొనేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఫలితాలపై అభ్యర్థులతో పాటు, వారి గెలుపు, ఓటములపై పందెలు కాసిన బెట్టింగ్‌ రాయుళ్లు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top