షరతులు వర్తిస్తాయి

Election Commission Green signal to the state cabinet meeting on conditions - Sakshi

రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌

కరవు, తుపాను, మంచినీటి సరఫరా, ఉపాధి పనులపై సమీక్షకే పరిమితం కావాలని స్పష్టీకరణ

కొత్త నిర్ణయాలు, రేట్ల మార్పు, బకాయిల చెల్లింపులపై నిర్ణయాలేవీ తీసుకోరాదు

కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ఈసీ అనుమతి పొందాకే అమలు చేయాలి

కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశాన్ని నిర్వహించరాదు

నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ కానున్న క్యాబినెట్‌

సోమవారం ఉదయమే కేబినెట్‌ అజెండాపై సీఎంతో చర్చించిన సీఎస్‌

ఈసీ అనుమతి రాకపోతే అధికారులతో సమీక్షించాలని భావించిన సీఎం

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) సోమవారం సాయంత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరువు, ఫొని తుపాను సహాయక చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధిహామీ పనులపై సమీక్షించేందుకు మాత్రమే సమావేశం పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ నాలుగు అంశాలపైనే సమీక్షించాలని, కొత్త నిర్ణయాలు ఏవీ తీసుకోరాదని, రేట్ల  మార్పు, బకాయిల చెల్లింపులపై నిర్ణయాలు తీసుకోరాదని షరతు విధించింది. అంతేకాకుండా కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కమిషన్‌ అనుమతి తీసుకున్న తరువాతే అమలు చేయాలని పేర్కొంది. కేబినెట్‌ నిర్ణయాలపై మీడియా సమావేశం నిర్వహించరాదని కూడా కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖలు పంపింది. కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు ఈసీ అనుమతించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. దీంతో కేబినెట్‌ భేటీ ఉంటుందా లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. తొలుత మంగళవారం ఉదయం 10.30 గంటలకు కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.  అయితే కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం సోమవారం సాయంత్రానికిగానీ వెలువడకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి..
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగానే కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. కేబినెట్‌ సమావేశానికి సీఎస్‌ ఎందుకు రారో చూస్తానంటూ అధికారులను బెదిరించే ధోరణిలో సీఎం మాట్లాడారు. తొలుత ఈనెల 10వ తేదీన కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కార్యాలయం ఈనెల 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్‌ పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎల్వీ సుబ్రహ్మణ్యం అదే రోజు స్పందిస్తూ ఏ అంశాలపై కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారో నోట్‌లో పేర్కొన లేదని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున కేబినెట్‌ సమావేశ నిర్వహణకు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన నోట్‌ను సీఎస్‌ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌కు పంపించారు.

చివరకు ఈసీ నిబంధనలకు తలొగ్గి..
కేబినెట్‌లో చర్చించాల్సిన అంశాలతో నోట్‌ పంపిస్తే స్క్రీనింగ్‌ కమిటీ అధ్యయనం తరువాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీ అనుమతి కోసం పంపిస్తామని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. కమిషన్‌కు 48 గంటల ముందు అజెండాను పంపాల్సి ఉంటుందని సీఎస్‌ తెలిపారు. దీంతో ఈనెల 7వ తేదీన మనసు మార్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్‌ భేటీని 14వ తేదీన జరపాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని సీఎం కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్‌ ద్వారా తెలిపింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి (రాజకీయ) ఎన్‌.శ్రీకాంత్‌ అదే రోజు సమావేశమై చర్చించారు. కోడ్‌ అమల్లో ఉన్నందున కేబినెట్‌ భేటీకి ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని, కేబినెట్‌లో చర్చించే అంశాల అజెండాను కూడా పంపించాల్సి ఉంటుందని సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌కు సీఎస్‌ స్పష్టం చేశారు. దీంతో కరువు, ఫొని తుపాను సహాయ చర్యలు, మంచినీటి సరఫరా, ఉపాధి హామీ పనులపై సమీక్షించనున్నట్లు సీఎం కార్యాలయం సీఎస్‌కు నోట్‌ పంపించింది. అందుకు అనుగుణంగా వివరాలు సిద్ధం చేయాలని ఆయా శాఖలను సీఎస్‌ ఈనెల 7వ తేదీనే ఆదేశించారు.

అజెండాను పరిశీలించిన స్క్రీనింగ్‌ కమిటీ
నాలుగు అంశాలపై కేబినెట్‌ నోట్‌లను ఈ నెల 9వతేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సాధారణ పరిపాలన శాఖకు పంపించాలని సీఎస్‌ ఆదేశించారు. కేబినెట్‌ నోట్‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉన్నాయా లేదా? అనే విషయాన్ని అదే రోజు సీఎస్‌ నేతృత్వంలో సమావేశమైన స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించింది. అనంతరం ఈ నాలుగు అంశాలపై కేబినెట్‌కు వివరించేందుకు అనుమతించాల్సిందిగా ఈసీని కోరాలని కమిటీ నిర్ణయించింది. స్క్రీనింగ్‌ కమిటీ నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి ఈనెల 10వ తేదీన సీఎస్‌ పంపారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదీ దీన్ని యధాతథంగా అదే రోజు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. ఈసీ నిర్ణయం ప్రకటించేందుకు 48 గంటల సమయం అవసరమని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఆదివారం సాయంత్రానికి వెలువడుతుందని భావించారు. అయితే ఆదివారం ఆరో దశ పోలింగ్‌ ఉండటంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని సోమవారం సాయంత్రం తెలియజేసింది.

సీఎంతో సీఎస్‌ రెండోసారి భేటీ
కేబినెట్‌ సమావేశ నిర్వహణకు అనుమతించాలంటూ తాను పంపిన నివేదికపై  తొలుత ఈసీ నిర్ణయం వెలువడకపోవటంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇప్పటివరకు మంత్రివర్గ సమావేశ నిర్వహణకు ఈసీ నుంచి అనుమతి రాలేదని, సాయంత్రం లోపు రావచ్చేమోనని సీఎంకు ఆయన వివరించినట్లు తెలిసింది. ఒకవేళ ఈసీ అనుమతి రాకపోతే మంత్రివర్గ సమావేశం జరపటానికి వీలు కాదు కాబట్టి ఆయా శాఖల అధికారులతో మంగళవారం ఉదయం సమీక్షిద్దామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే అనుమతి రాని పక్షంలో సమీక్షను మధ్యాహ్నం తరువాత నిర్వహిద్దామని సీఎస్‌ సూచించగా అందుకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. 

వివాదాలకు తావివ్వకుండా....
మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెళ్లి కలవడంతో వీరిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై సోమవారం మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ‘సీఎం చంద్రబాబు నోరు జారి లేనిపోని అభాండాలు, వ్యక్తిగత విమర్శలు చేసినా సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా వ్యవహరించారు. ముఖ్యమంత్రి టీమ్‌ లీడర్‌. ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడతా. సీఎంను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. అని చెప్పడం ద్వారా ఎల్వీ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌ అయి నెల రోజులు దాటినా సీఎంను కలవలేదని చాలామంది అంటుంటారు. కొన్ని మీడియాల్లో కూడా అలాగే వార్తలు వచ్చాయి. అయితే అది వాస్తవం కాదు. సీఎస్‌గా నియమితులైన వెంటనే గత నెల 8వ తేదీన ఆయన మర్యాదపూర్వకంగా వెళ్లి ముఖ్యమంత్రిని కలసి వచ్చారు. ఇప్పుడు కేబినెట్‌ భేటీ జరుగుతుందా? లేదా? అనే ఉత్కంఠ నేపథ్యంలో మరోసారి వెళ్లి సీఎంను కలసి అన్ని విషయాలు మాట్లాడి వచ్చారు..’ అని పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top