ఎమ్మెల్యే పోతుల కారు ఢీకొని వృద్ధ దంపతుల మృతి | Elderly couple are dead with the accident of MLA Pothula Ramarao | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పోతుల కారు ఢీకొని వృద్ధ దంపతుల మృతి

Aug 30 2018 4:29 AM | Updated on Sep 5 2018 2:12 PM

Elderly couple are dead with the accident of MLA Pothula Ramarao - Sakshi

డివైడర్‌పైకి దూసుకెళ్లిన పోతుల రామారావు కారు. (ఇన్‌సెట్‌లో) మృతురాలు సీతామహాలక్ష్మి

గన్నవరం: ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు ఢీకొని బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలో వృద్ధ దంపతులు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ బయలుదేరిన ఎమ్మెల్యే గన్నవరం విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగి ఇద్దరు దుర్మరణం పాలైనా పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఆటోలో విమానాశ్రయానికి వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎమ్మెల్యే పోతుల రామారావు నడుపుతున్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామానికి చెందిన పొట్ట హరినారాయణరెడ్డి (67), సీతామహాలక్ష్మి (62) దంపతులు కంకిపాడులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ముస్తాబాద మీదుగా కేసరపల్లి వచ్చి బైపాస్‌ వద్ద జాతీయ రహదారి దాటసాగారు.  ఆ సమయంలో హైదరాబాద్‌లో నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే పోతుల రామారావు కారు అతివేగంగా స్కూటీని ఢీకొని, జాతీయ రహదారి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. తలకు తీవ్రగాయాలైన సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న హరినారాయణరెడ్డిని చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. సీతామహాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

ప్రమాద సమయంలో కారు నడిపిందెవరు?
ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎమ్మెల్యే నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే గన్‌మెన్‌ సహాయంతో డ్రైవర్‌ సీటులో నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. కారు దిగిన ఎమ్మెల్యే వెంటనే గన్‌మెన్‌తో కలిసి ఆటోలో విమానాశ్రయానికి వెళ్లిపోయారని చెప్పారు. ఆయన అనుచరులు కొందరు అసలు ఎమ్మెల్యే కారులోనే లేరని బుకాయించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే ఉన్నట్లు అంగీకరించిన డ్రైవర్‌ ఏడుకొండలు వాహనాన్ని ఎవరు నడుపుతున్నారని అడిగితే మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పోలీసులు సైతం టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ ఎం.కొండలరావుపై కేసు నమోదు చేసి, కారును సీజ్‌ చేసినట్లు విజయవాడ ఈస్ట్‌జోన్‌ ఏసీపీ వి.విజయ్‌భాస్కర్‌ తెలిపారు. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement