‘ఎగ్‌’ బాకుతోంది!

Egg Prices Hikes in Kurnool - Sakshi

పెరుగుతున్న గుడ్డు ధర

కొనలేకపోతున్న ప్రజలు

కర్నూలు (వైఎస్సార్‌ సర్కిల్‌): ఆమ్లెట్‌.. బాయిల్డ్‌ ఎగ్‌.. ఎగ్‌కర్రీ..ఎగ్‌ బురుజు..ఎగ్‌ బిర్యానీ..ఎగ్‌ రోస్టు, ఎగ్‌ దోస.. చదువుతుంటే నోరూరుతుందా?..ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తోందా?..అయితే కాస్త ఆగండి! గుడ్డు ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. వారానికి నాలుగు సార్లు తినేవారు సైతం మెనూ మార్చుకుంటున్నారు. 

జిల్లాలో 200 మంది పౌల్ట్రీ రైతులకు 1,500 కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో 2 లక్షల వరకు కోళ్లను పెంచుతున్నారు. ప్రస్తుతం వీటి నుంచి 13 లక్షల గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లా జనాభా 43 లక్షలు మంది ఉన్నారు...వీరికి 23 లక్షల వరకు గుడ్లు అవసరమవుతాయి. ఉత్పత్తి అయిన గుడ్లు సరిపోకపోవడంతో వ్యాపారులు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాళ్, బిహార్, ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో గుడ్ల వినియోగం పెరిగింది. దీంతో జిల్లాకు సరఫరా చేసే వాటిని అక్కడికి పంపిస్తున్నారు. దీంతో ధర  అన్యూహంగా పెరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

సాధారణంగా కార్తీకమాసంలో గుడ్డు ధర దిగజారుతుంది. అయితే ఈ సారి మాత్రం స్థిరంగా కొసాగింది. కార్తీక మాసం వెళ్లిన తరువాత పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం గుడ్డు ధర రిటైల్‌గా రూ.4.33 పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో రూ.5 ప్రకారం విక్రయిస్తున్నారు. కార్తీక మాసంలోనూ డిమాండ్‌ పెరగడంతో ధర స్థిరంగా కొనసాగి..ప్రస్తుం పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.   

కొండెక్కిన కోడి ధర..
క్రిస్‌మస్, నూతన సంవత్సరం వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో గుడ్లతో పాటు చికెన్‌ ధరలు కూడా కొండెక్కాయి. వారం క్రితం లైవ్‌ కోడి కిలో 90 రూపాయలు ఉండగా ప్రస్తుతం రూ.120 పెరిగింది. అదే విధంగా డ్రెస్‌ చేసిన కిలో చికెన్‌ వారం క్రితం రూ.160 ఉండగా ప్రస్తుతం రూ.180 నుంచి రూ.190 వరకు పెరిగింది. అదే విధంగా స్కిన్‌ లెస్‌ చికెన్‌ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.200కు పెరిగింది.

ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి  
కోళ్లకు సరఫరా చేసే దాణాను సబ్సిడీ రూపంలో అందజేసి ప్రోత్సహిస్తే రైతులు నష్టాల నుంచి బయటపడుతారు. కోళ్ల షెడ్లకు, కరెంటు ఇలాంటి వాటిలో రాయితీలు ఇస్తే పెంపకం పెరుగుతోంది. దీంతో ధరలు తగ్గే అవకాశం ఉంది.– రాజారెడ్డి,  ఫౌల్డ్రీ రైతు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top