ప్రైవేటుపై విద్యాశాఖ బెత్తం | Education Department notice To Private Schools | Sakshi
Sakshi News home page

ప్రైవేటుపై విద్యాశాఖ బెత్తం

Mar 21 2018 12:43 PM | Updated on Mar 21 2018 12:43 PM

Education Department notice To Private Schools - Sakshi

పిఠాపురం: ఒక్కో పాఠశాలకు రూ.60 వేల జరిమానాలు చెల్లించాలంటూ విద్యాశాఖ జారీ చేసిన నోటీసులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల్లో కలవరం పుట్టిస్తోంది. గత ఏడాది నవంబరు నెలలో ఒక్కో స్కూలుకి రూ.1000 చెల్లించి అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. దీంతో ఆరు నెలలకుగాను ఒక్కో నెలకు రూ.10 వేల చొప్పున రూ.60 వేల జరిమానా చెల్లించాలని, లేకపోతే ఆయా పాఠశాల ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న  గుర్తింపును రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు  గత రెండు రోజులుగా జిల్లాలో సుమారు 3,200 పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీలకు అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ జీఓ నంబరు 1 ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీలోపు అనుమతులు తీసుకోని ప్రతి పాఠశాల గుర్తింపు రద్దు చేసి ఆయా పాఠశాలలను సీజ్‌ చేస్తామని విద్యాశాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా విద్యాశాఖకు రూ.19 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది.

ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఆందోళన
విద్యాశాఖ నోటీసులపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గొల్లప్రోలు మాధురి విద్యాలయంలో మంగళవారం సమావేశమైన ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు విద్యాశాఖ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించాయి.

అనుమతులు తీసుకోకపోతే పాఠశాలలు సీజ్‌ చేస్తాం...
ప్రభుత్వ జీఓ నంబరు ఒకటి ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీలోపు అనుమతులు తీసుకోని ప్రతి పాఠశాల గుర్తింపు రద్దు చేసి ఆయా పాఠశాలలను సీజ్‌ చేస్తాం. తప్పనిసరిగా జరిమానాలు చెల్లించి అనుమతులు పొందాలి. అలా కాకుండా ఎవరైనా నిరసనలు తెలిపే ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోయినా...ఎట్టి పరిస్థిల్లోనూ ఉపేక్షించేది లేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ దాటిన వెంటనే అనుమతులు లేని అన్ని పాఠశాలలు మూసివేస్తాం. గత ఏడాది అక్టోబరు నెలలోనే మేము నోటీసులు ఇచ్చాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్లుగా అనుమతులు లేకుండా ఎల్‌కేజీ యూకేజీలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఇప్పుడు ఆందోళన చేస్తామంటే చూస్తు ఊరుకోం.– అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ

విద్యాశాఖ తీరు అభ్యంతరకరం
విద్యాశాఖ తీరు అభ్యంతరకరంగా ఉంది. విద్యా సంవత్సరం ఆరంభంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇప్పుడు హఠాత్తుగా నోటీసులు ఇచ్చి జరిమానాలు చెల్లించమనడం దారుణం. దీనిపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. విద్యాశాఖ ఈ నోటీసులను వెనక్కి తీసుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం. జరిమానాలు విధించడం వల్ల ఇటు విద్యా సంస్థలపైనా, విద్యార్థులపైనా తల్లిదండ్రుల పైనా భారం పడుతుంది. దీనిపై విద్యాశాఖ పునరాలోచించి నోటీసులు వెనక్కి తీసుకోవాలి.– కడారి తమ్మయ్యనాయుడు,ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్, తూర్పు గోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement