ఆడబిడ్డ పుడుతుం దని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడవద్దని, వారిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని హైకోర్టు జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు.
గోదావరిఖనిటౌన్, న్యూస్‌లైన్ : ఆడబిడ్డ పుడుతుం దని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడవద్దని, వారిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలని హైకోర్టు జస్టిస్ బి.చంద్రకుమార్ కోరారు. గోదావరిఖని శారదనగర్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీ పీజీ కళాశాలలో శనివారం ఏర్పాటుచేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఉనికిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
మంచి కోసం సమాజంలోని ప్రతిఒక్కరూ కుటుంబ స్థాయి నుంచే మార్పు తీసుకురావాలని కోరారు. ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భారతదేశ సంప్రదాయాలను పాటించకపోవడంతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. జిల్లా ఆరో అదనపు జడ్జి వెంకటకృష్ణయ్య, మంథని మెజిస్ట్రేట్ కుమారస్వామి, న్యాయవాదులు రవికుమార్, రాజయ్య, ఘంట నారాయణ, అమరేందర్‌రావు, సంజయ్‌కుమార్, శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత పాల్గొన్నారు.
పౌష్టికాహారం ప్రారంభం
స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో హైకోర్టు జస్టిస్ బి.చంద్రకుమార్ పౌష్టిక ఆహారాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చిన్నచిన్న సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని సూచించారు. అనంతరం నిర్భయ చట్టంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనోధైర్యంతో ముందుకు సాగాలి
కరీంనగర్ అర్బన్ : మహిళలు మనోధైర్యంతో ముందుకుసాగాలని, తద్వారా లక్ష్యాలను సాధించాలని హైకోర్టు జడ్జి బి.చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ‘మహిళలపై అత్యాచారాలు’ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో మాట్లాడారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. నైపుణ్యం పెంచుకుని మంచి వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. జిల్లా జడ్జి నాగమారుతీ శర్మ మాట్లాడు తూ ప్రతి మనిషిలో మానవత్వం ఉండాలన్నారు. ఆడపిల్ల తల్లిదండ్రులకు భారం కాదన్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ బాల భాస్కర్‌రావు పాల్గొన్నారు.