ప్రజల ఆశాజ్యోతి జగన్‌

Editor Imam Write A Story On YS Jagan PrajaSankalpaYatra Complete One Year - Sakshi

ఓ ప్రజానాయకుడు అనేక ప్రతికూల రాజకీయ పరిణామాలు ఎదురుర్కొంటూ సంవత్సరం పాటు జరిపిన ప్రజాసంకల్పయాత్ర భారతదేశ రాజకీయ చిత్రపటంలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గది. వైఎస్‌ కుటుంబం ప్రజా సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు చేయడం మనం గమనించాం. అదే కుటుంబం నుంచి నేడు జననేత జగన్‌ రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం లిఖించారు. తన ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా నాయకుడిగా ఎదిగి సమకాలీన రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిర పరుచుకున్నారు. 

పాదయాత్ర సందర్భంగా జగన్‌ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలకు ఇసుక వేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. పాదయాత్రలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించక ముందు చంద్రబాబు శాసనసభను తన నియంతృత్వ పోకడతో ఒక నిర్జీవమైన సభగా మార్చుకున్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేశారు.  వ్యవస్థలన్నింటినీ భ్రష్ట్పుట్టించారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల్లో అవినీతి వరదలై పారింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రశ్నించేవారిని నిర్భందిస్తున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా దోపిడీకి పూనుకున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు.

ప్రతిపక్షనేతగా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడుతూ ఒక పరిపక్వత కలిగిన నేతగా తన రాజకీయ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ప్రజలకు జగన్‌ ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. తమను కష్టాల నుంచి నవరత్నాల ద్వారా గట్టెక్కించగలరని నమ్ముతున్నారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న తెలుగుదేశం నేతలు జగన్‌పై హత్యాయత్నం కుట్ర చేశారు. జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ దాడి. ఈ దాడికి చంద్రబాబుగారే బాధ్యత వహించాలి. ఒక ముఖ్యమంత్రిగా బాబు ఈ ఘటనపై స్పందించిన తీరు ప్రజాస్వామిక వ్యవస్థకు సిగ్గుచేటు. రాజకీయ లబ్ధి కోసం జగనే దాడి చేయించుకున్నాడని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటనలు చేయడం నీచాతినీచం. 

వారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు అద్దం పడుతుంది. చంద్రబాబు వెకిలి నవ్వులు సినిమాలోని క్రూరమైన విలన్‌లాగా ఉన్నాయి. పాదయాత్రలో ప్రజలు జగన్‌కు జేజేలు పలకడం చంద్రబాబు భరించలేకపోయారు. కుట్రతో జగన్‌ను భౌతికంగా అడ్డు తొలగించుకోవడానికి వ్యూహం పన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంపై నేటికీ ప్రజల్లో అనుమానాలు బలంగా ఉంది.

నేడు వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులే నాడు వైఎస్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాలి. ఆ శక్తులు మరోరూపంలో ఆంధ్రప్రదేశ్‌లో సమీకృతం అవుతున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నంపై లోతుగా పరిశోధించి దోషులను శిక్షించాలి.

థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని చేస్తున్న పోరాటం విజయవంతం కావాలి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఒక బలమైన ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక రకంగా చంద్రబాబు గారికి బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేక.. బాధ్యత మరిచి ఆయన్ను బలపరుస్తూ పగలును రాత్రిగా, ఎండలను నీడగా, చీకటిని వెలుతురుగా చూపించడానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. జగన్‌ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడం, చంద్రబాబును స్థాయికి మించి మోయడం ఒక చీకటి అధ్యాయం. ప్రజలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎల్లో మీడియా కుట్రలను, కుతంత్రాలను అర్థం చేసుకుంటున్నారు. రాజకీయ ప్రజాక్షేత్రంలో ఈ శక్తులకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారు. - ఇమామ్, కదలిక ఎడిటర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top