ఇరు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ రాయాలి! | Eamcet exam to be written in both states | Sakshi
Sakshi News home page

ఇరు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ రాయాలి!

Feb 25 2015 9:59 PM | Updated on Sep 2 2017 9:54 PM

తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనుండడంతో 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం విద్యార్థులు..

విజయవాడ: తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనుండడంతో 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం విద్యార్థులు 2 ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రీజియన్లలోని మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లను ఆయా లోకల్ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా ఇతర రీజియన్లకు కేటాయించేవారు. అవిభాజ్య రాష్ట్రంలో ఒకే ఎంసెట్ ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ వేర్వేరు ఎంసెట్‌లు నిర్వహిస్తుండడంతో అన్‌రిజర్వుడ్ మెరిట్ సీట్ల కోసం సొంత రాష్ట్రం నిర్వహించే ఎంసెట్‌తో పాటు తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్, ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాయాల్సి ఉంటుందన్నారు.

గతంలో మాదిరిగానే లోకల్, అన్‌రిజర్వుడ్ సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సాంకేతికంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని వీసీ అభిప్రాయపడ్డారు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఇప్పటికీ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల స్టేట్‌వైడ్ కళాశాలగానే ఉన్న దృష్ట్యా 64 శాతం సీట్లు ఏపీకి, 36 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు చెందనున్నాయి. పీజీ మెడికల్ ఎంట్రన్స్‌కు సర్వం సిద్ధం 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మార్చి 1న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు వీసీ రవిరాజు తెలిపారు. తెలంగాణ, ఏపీలకు సంయుక్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సుమారు 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 26 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్‌జీ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement