
ఆరు నెలల్లో కుప్పంలో ప్రతి ఇంటికీ గ్యాస్
రాబోయే ఆరు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ
రూ.500 కోట్లతో గుడివంక
సుబ్రమణ్యస్వామి ఆలయ అభివృద్ధి
ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మిస్తా
నియోజకవర్గంలోనాలుగు కోల్డ్ స్టోరేజీలు
కుప్పాన్ని దేశంలో నంబర్ వన్ చేస్తా
గుడివంక సభలో సీఎం చంద్రబాబు
చిత్తూరు:రాబోయే ఆరు నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం గుడుపల్లె మండలం గుడివంకలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇంకా 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ గ్యాస్ అందిస్తామన్నారు. దీంతో పాటు నియోజకవర్గంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లను నిర్మిస్తామన్నా రు. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలు చెల్లిస్తుందన్నారు. టమాటాతో పాటు రైతులు పండించే ఇతర కాయగూరలు నిల్వ ఉంచుకునేందుకు నాలుగు మండలాల్లో ఒక్కో కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామన్నారు. అలాగే టమాట జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామన్నారు. పోటాటో (బంగాళాదుంప) చిప్స్ పరిశ్రమ కోసం పెప్సీ కంపెనీతో మాట్లాడుతున్నట్లు సీఎం వెల్లడించారు.
రూ.300 కోట్లతో పలమనేరు-కృష్ణగిరి రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. వాడియంబాడీ వయా వి.కోట రోడ్డు సైతం నిర్మిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గం నుంచి విదేశాలకు 20 వేల మందికి పైగా వెళ్తున్నారని, అందరి సౌకర్యం దృష్ట్యా విమానాశ్రయాన్ని నిర్మించి కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తానని సీఎం చెప్పారు. అలాగే గుడివంకలోని ఇంటర్ మీడియట్ కాలేజీకి పూర్తిస్థాయిలో కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. టీటీడీ అతిథి గృహాలను అభివృద్ధి చేస్తామన్నారు. రూ.500 కోట్లతో 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుడివంక సుబ్రమణ్యస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్కులు, రిసార్ట్స్ నిర్మిస్తామన్నారు. గుడుపల్లెలో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు కుప్పం అభివృద్ధికి అహర్నిశలు పని చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పీ చైర్‌పర్శన్ గీర్వాణీ, చిత్తూరు నగర మేయర్ కఠారి అనురాధ, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జడ్పీ సీఈఓ వేణుగోపాల్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, హౌసింగ్ పీడీ వెంకటరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయకుమార్‌లతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.
హంద్రీ-నీవా పనుల వేగవంతం కోసం సీయం సమీక్ష
జిల్లాలో హాంద్రీ-నీవా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కాంట్రాక్టర్లతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో పాటు పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో సీఎం సమావేశమయ్యారు. పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీకి ప్రతినిధులకు, ఇరిగేషన్ అధికారులకు సూచించారు.