
సాక్షి, శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి వైఎస్సార్‌సీపీ నేత, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్ సవాలు విసిరారు. అచ్చెన్నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ సభలో వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టెక్కలి అంబేద్కర్ జంక్షన్ వద్ద ప్రజాసమక్షంలో తేల్చుకుందామని అన్నారు.
అచ్చెన్నాయుడి రౌడీ రాజకీయాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటి గురించి త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. ఆయన ఆరోపణనలపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, తేదీ మీరే నిర్ణయించుకోని చర్చకు రావాలన్నారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. వైఎస్ జగన్‌పై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని పేర్కొన్నారు.