..తప్పేముందీ!

Durga Temple Employees Rejoin in Posts - Sakshi

దుర్గగుడి ఉద్యోగులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

విధుల్లోకి ఏఈఓ అచ్యుతరామయ్య

క్షమాపణ చెప్పడంతో వివాదం కొలిక్కి ఇంతకీ మెమెంటోల కొనుగోలులో అవినీతి జరగలేదా?

పోలీసు కేసు హుళక్కేనా!?

సాక్షి, విజయవాడ: దుర్గగుడిపై తప్పులను మాఫీ చేయడంలో దుర్గగుడి అధికారులకు పెట్టింది పేరు. అవినీతికి పాల్పడేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించిన కొద్దిరోజులు సస్పెన్షన్‌ చేసి తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

విధుల్లోకి నలుగురు ఉద్యోగులు...
దసరా ఉత్సవాల్లో జ్ఞాపికల కోనుగోలులో అవినీతి చోటుచేసుకుంది. 1200 కోనుగోలు చేసి 2,000లకు బిల్లులు పెట్టారు. గుమాస్తా నుంచి ఏఈఓ వరకు అందులో ప్రాతదారులే. చివరకు భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈఓ కోటేశ్వరమ్మ చర్యలు తీసుకున్నారు. వెంటనే నలుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. అంతే కాకుండా మీడియా ఎదురుగా వాగ్వాదానికి దిగి బెదిరించిన ఏఈఓ అచ్యుత రామయ్యపై ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దేవస్థానంలో అవినీతి పక్షాళన ప్రారంభమైందని అందరూ భావించారు.

అధికార పార్టీనా? మజాకా?
వెంటనే ఏఈఓ అచ్యుతరామయ్య అధికారపార్టీ నేతలను ఆశ్రయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలక నేత, దేవస్థానానికి సమీపంలో ఉండే మరో ప్రజాప్రతినిధి తెరవెనుక ఈ విషయంలో జోక్యం చేసుకుని చక్రం తిప్పారు. దీంతో పాలకమండలి చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు రంగంలోకి దిగి సిబ్బందిపై సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ఈఓతో సంప్రదింపులు జరిపారు.

క్షమాపణలతో సమసిన వివాదం...
ఏఈవో అచ్యుతరామయ్య, చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు సమక్షంలో విలేకరుల సమావేశం పెట్టి తాను ఈలో కోటేశ్వరమ్మను దూషించడం తప్పేనంటూ పచ్చాతాపం ప్రకటించారు. ఆ తరువాత ఈఓ, ఏఈఓల మధ్య రాజీ ప్రయత్నాలు జరిగాయి. చివరకు శుక్రవారం సిబ్బందిపై ఈఓ సస్పెన్షన్‌ ఎత్తివేశారు. కాగా పోలీసులు కూడా ఈ కేసుపై విచారణ చేసి అవినీతి జరిగిన మాట వాస్తవమేనని నిందితులను అరెస్టుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈఓ కోటేశ్వరమ్మ సూచన మేరకు అరెస్టులు చేయలేదు. సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో  తప్పు ఓప్పుయిందా? అని భక్తులుప్రశ్నిస్తున్నారు. దుర్గగుడిలో ఎంతటి అవినీతి జరిగినా, ఏ తప్పులు చేసినా అధికారపార్టీ నేతల్ని  ఆశ్రయిస్తే అన్ని సమసిపోతాయని మెమోంటోల స్కామ్‌ రుజువు చేస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top