తప్పెవరిది | Sakshi
Sakshi News home page

తప్పెవరిది

Published Thu, Jan 30 2014 1:40 AM

Durga Devi, Provided entry degree Now no Education two year waste

సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆ విద్యార్థిని నాడు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణురాలయిందన్నారు. మార్కుల జాబి తా ఎక్కడో మిస్సయిందని, త్వరలోనే రప్పిస్తామన్నారు. ఈలోగా మార్కుల మెమోతో డిగ్రీలో చేరాలని చెప్పారు. చేరి రెండేళ్లయిన తర్వాత అసలు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కాలేదని, ప్రస్తుతం చేస్తున్న డిగ్రీ చెల్లదని చెబుతున్నారు. విజయనగరం మహరాజ మహిళా కళాశాలలో ఈ భాగోతం చోటు చేసుకుంది. ఇప్పుడా విద్యార్థిని మానసిక క్షోభను అనుభవిస్తోంది. నాటి కథఆ విద్యార్థిని పేరు గంటా దుర్గాదేవి. మహరాజ మహిళా కళాశాలలో 2010-12లో ఇంటర్మీడియెట్(హెచ్‌ఈసీ) చదివింది. 2012లో వెలువరించిన ఫలితాల్లో ఉత్తీర్ణులైన జాబితాలో ఆమె హాల్ టిక్కెట్ నంబర్ ఉంది. డి గ్రేడ్‌లో ఉత్తీర్ణురాలైనట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కుల జాబితా కోసం కళాశాలకు వెళ్లింది. మార్కుల జాబితాల్లో దుర్గాదేవికి చెందిన మార్కుల లిస్టు లేకపోవడంతో ఎక్కడో మిస్సయిందని, తర్వాత రప్పిస్తామని సిబ్బంది చెప్పారు. ఈలోగా నెట్‌లో లభించే మార్కుల మెమో ఆధారంగా డిగ్రీలో చేరవచ్చని సలహా ఇచ్చారు. దీంతో అదే కళాశాలలో బీఏ(హెచ్‌ఈపీ)లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో మార్కుల మెమోను సమర్పించా రు. ఏఒక్కరూ అభ్యంతరం తెలపకుండా డిగ్రీలో చేర్చుకున్నారు.
 
 మధ్యలో వ్యథ
 డిగ్రీలో చేరిన దగ్గరి నుంచి ఇంటర్మీడియట్ మార్కుల జాబితా కోసం కళాశాల సిబ్బందిని దుర్గాదేవి అడుగుతూ ఉన్నా రు. ఇదిగో అదిగో అని కొన్నాళ్లు చెప్పుకొచ్చారు. మధ్యలో సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు. మార్కుల జాబితా తన వద్దే మిస్సింగ్ అయ్యిందంటూ పేర్కొని, కొత్త మార్కుల జాబితా ఇవ్వాలని కోరుతూ దరఖా స్తు చేసుకోవాలని దుర్గాదేవిపై ఒత్తిడి చేశారు. అసలు చేతి కందని జాబితా మిస్ అయిందని ఎలా చెప్పగలనని, కొత్తగా ఇప్పించండని ఎలా కోరగలనని ఆ విద్యార్థిని అభ్యం తరం వ్యక్తం చేశారు. దీంతో ఇంటర్మీడియట్ బోర్డును స్వయంగా సిబ్బందే తరుచూ వాకబు చేస్తూ వచ్చారు. 
 
 ఆలస్యంగా బయటపడిన అసలు విషయం 
 ఎన్ని పర్యాయాలు వాకబు చేసినా ఇంటర్ బోర్డు స్పందించకపోవడంతో లిఖిత పూర్వకం గా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. దుర్గాదేవి అసలు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కాలేదని, అప్పట్లో ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాయలేదని అక్కడి అధికారులు నింపాదిగా సెలవిచ్చారు. దీంతో తేరుకున్న కళాశాల సిబ్బంది డిగ్రీ ప్రవేశ సమయంలో విద్యార్థిని సమర్పించిన మార్కుల మెమోను పరిశీలించారు. ఇందులో ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ నాట్ క్వాలిఫైడ్ అని ఉండటాన్ని గుర్తించి కంగుతున్నారు. అప్పట్లో పరిశీలించకుండా ప్రవేశమిచ్చేశామని నాలిక కరుచుకున్నారు.  దీన్ని సరిచేయడమెలా అని మల్లగుల్లాలు పడ్డారు. ఏం చేసినా ఉత్తీర్ణులైనట్టు చేయలేమని, విద్యార్థినికి అసలు విషయం చెప్పడమే సరైనదని నిర్ణయించుకున్నారు. 
 
 డిగ్రీ చదువు చెల్లదని తాజాగా స్పష్టీకరణ 
 వాస్తవాన్ని గుర్తించిన కళాశాల సిబ్బంది విద్యార్థికి అసలు విషయాన్ని ఇటీవల చెప్పారు. ఇంటర్మీడియట్‌లో ఉండిపోయిన ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాసి పాసైతేనే సర్టిఫికెట్ వస్తుందని పేర్కొన్నారు. ఇంతవరకు చదివిన డిగ్రీ చెల్లదని, ఇంటర్ పాసైన సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే డిగ్రీలో చేరాలని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో విద్యార్థిని దుర్గాదేవి, ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంత పోయారు. తనకెందుకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. కళాశాల వద్దకు వెళ్లి రెండేళ్లు వృథా అవుతుందని, తనకు న్యాయం చేయాలని ప్రాధేయ పడుతున్నారు. కానీ కళాశాల అధికారులు తామేమి చేయలేమని చేతులేత్తేస్తున్నారు. 
 
 తల్లిదండ్రుల ఆవేదన 
 దుర్గాదేవి తండ్రి నర్సింగరావు ఆటో డ్రైవర్‌గా, తల్లి పద్మ కూలీగా పనిచేస్తున్నారు. విజయనగరం నటరాజ్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబమది. కష్టపడి చదివిస్తున్న తన కూతురుకు అన్యాయం జరిగిందని, తాము తట్టుకోలేకపోతున్నామని, ఎలాగోలా న్యాయం చేయాలని తెలిసిన వారందరి వద్ద ప్రాధేయ పడుతున్నారు.
 
 గతంలో జరిగింది...
 నా హయాంలో తప్పు జరగలేదు. డిగ్రీ ప్రవేశ సమయంలో గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే చాలాసార్లు మాట్లాడాం. ఇంటర్మీడియెట్‌లో ఉండిపోయిన ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణమవ్వడం తప్పా వేరే దారిలేదు. ఆ తర్వాతే డిగ్రీ చదవాల్సి ఉంది. ఆమెకు న్యాయం చేసే విషయంపై ఆలోచిస్తున్నాం. 
 - ఎం.రాజేశ్వరి, 
 ఎంఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్    

Advertisement

తప్పక చదవండి

Advertisement