డ్రగ్స్‌ పడగ!

Drugs Business In Krishna District - Sakshi

విజయవాడ నగరంలో డ్రగ్స్‌ కలకలం 

వెస్ట్‌ బెంగాల్‌ నుంచి బెజవాడ నగరానికి.. 

గుట్టుగా యువతకు విక్రయించే యత్నం

ఉచ్చులోకి దిగుతున్న పలువురు విద్యార్థులు 

ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సమాజంపై చిమ్మే అతి ప్రమాదకరమైన విషం మాదకద్రవ్యం. ఆనందం కోసం అంటూ తొలుత పరిచయమయ్యే డ్రగ్స్‌.. వ్యసనంగా మారుతుంది.. బానిసను చేస్తుంది.. జీవితాన్ని చిదిమేస్తుంది.. అంతిమంగా మరణశాసనం రాసేస్తుంది. అమరావతి రాజధానిపై మాదకద్రవ్యాల ముఠాలు విషం చిమ్మేందుకు పడగవిప్పాయి. యువతే లక్ష్యంగా డ్రగ్స్‌ వ్యాపారం చాపకిందనీరులా విస్తరిస్తోంది.    ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిఘా వర్గాలు.. పోలీసు శాఖ, యువత అప్రమత్తం కాకుంటే బెజవాడ నగరం డ్రగ్స్‌ ఉచ్చులో చిక్కుకోవడం ఖాయం.      

సాక్షి, అమరాతిబ్యూరో : అమరావతి రాజధానిలో మాదకద్రవ్యాల ముఠా జాడ కలకలం రేపుతోంది. ఈ ముఠా వెనుక పశ్చిమ బెంగాల్, ముంబై, హైదరాబాద్‌కు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్‌ ముఠాల నేపథ్యం కనిపిస్తోంది. విజయవాడకు దిగుమతి చేసిన మాదకద్రవ్యాలు అక్కడి నుంచే వచ్చినవి కావడం ఇందుకు నిదర్శనం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ ముఠాను అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంపన్న కుటుంబాలు, యువతే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరించాలని యత్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఈ ఉచ్చులోకి దించి తద్వారా భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవాలని పక్కా ప్రణాళికతో ఈ ముఠా సభ్యులు నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం.  

గంజాయి.. అల్పాజోలాం.. ఎల్‌ఎస్‌డీ. బ్రౌన్‌షుగర్‌.. కొకైన్‌.. హెరాయిన్‌.. ఇలా పేరు ఏదైనా మత్తే ప్రధానం. వీటిని ఆస్వాదిస్తున్న వారికి గుట్టుచప్పుడు కాకుండా సరఫరా జరుగుతోంది. ముంబై, హైదరాబాద్, గోవా కేంద్రంగా విజయవాడలోకి డ్రగ్స్‌ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేకించి సంపన్న వర్గాలు, సినిమా, రాజకీయ రంగాలకు సంబంధించిన ప్రముఖులే కాదు.. విద్యార్థులను టార్గెట్‌ చేసుకుంటున్న డ్రగ్స్‌ ముఠాలు వివిధ మార్గాల ద్వారా నగరానికి వాటిని చేరవేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రముఖ కళాశాలు గంజాయి, కొకైన్, హెరాయిన్‌ విక్రయాలకు అడ్డాగా మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్లే డ్రగ్స్‌ విక్రయదారులు నగరాన్ని తమ వ్యాపార కేంద్రంగా ఎంచుకున్నట్లు సమాచారం. పోలీసులు గట్టి నిఘా పెట్టకపోతే అమరావతి రాజధాని డ్రగ్స్‌కు అడ్డాగా మారుబోతుందనడంలో సందేహం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

నూతన సంవత్సర వేడుకలే టార్గెట్‌.. 
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో వివిధ రకాల ఈవెంట్‌ల పేరుతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు క్లబ్‌లు, హోటళ్లు, రిసార్ట్‌లు వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. న్యూ ఇయర్‌ వేడుకల్లో తినడం.. తాగడం అనేది కల్చర్‌లో ఓ భాగంగా భావిస్తున్న యుతను డ్రగ్స్‌ మత్తులో ముంచేందుకు చాపకింద నీరులా ముందుకు సాగుతున్నాయి కొన్ని ముఠాలు. ఈ నేపథ్యంలో ముందుగా ఇక్కడ డ్రగ్స్‌ విక్రయాలు అంచనా వేయడానికి ముందుగా కొద్ది మొత్తంలో కొకైన్‌.. హెరాయిన్‌ను నగరానికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ ముఠా సభ్యులు వివిధ వేషాలతో మత్తు మందులను దిగుమతి చేసే అవకాశముందన్న సమాచారంతో నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు శనివారం పచ్చిమ బెంగాల్‌ ముఠా సభ్యులు చేతికి చిక్కారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top