నీటి ఎద్దడితో గ్రామాలు విలవిల

నీటి ఎద్దడితో గ్రామాలు విలవిల


► అడుగంటిన భూగర్భ జలాలు

► నిరుపయోగంగా తాగునీటి పథకాలు




అసలే ఎండాకాలం. చుక్క నీరు దొరకని పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిపంపులు పనిచేయవు. ఇలాగైతే గ్రామాల్లో బతకడం ఎలా అని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లు, పక్క గ్రామాలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని, అధికారులు స్పందించి నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



బి.కోడూరు : ప్రస్తుతం మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటడంతో మండలంలోని సుమారు  సగానికి పైగా గ్రామాలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. గతంలో ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరుబావుల నుంచి తాగునీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.  అదనంగా మరొక బోరు వేయాలనుకున్నా నీరు పడతాయో లేదో అన్న అనుమానంతో ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని సాహసం చేయలేకపోతున్నారు. దీంతో మండలంలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు.



ముఖ్యంగా మండలంలోని మేకవారిపల్లె పాతూరులో గత నెల రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు ఉండగా వీరికి తాగునీటి కోసం గతంలో ప్రభుత్వం ఒక భూ ఉపరితల జలాశయం, ఒక డైరెక్టు పంపింగ్‌ స్కీంను ఏర్పాటు చేశారు. కానీ వాటి నుంచి సరిగా నీరు రాకపోవడంతో తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావుల వద్దకు, పక్క గ్రామాల్లోని మంచినీటి పథకాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల నుంచి సరిపడ నీరు రాకపోవడంతో భూఉపరితల జలాశయం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. తాగునీటి కోసం రేయింబవళ్లు పనులు వదిలిపెట్టి కాపలా కాయాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడికి తోడు ఎండలు మండుతుండటంతో పశువులకు తాగేందుకు నీటికి పడరాని పాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రసాద్‌ను వివరణ కోరగా ఈ ఏడాది గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది.  నీటి సమస్య లేకుండా అన్ని గ్రామాల్లో చర్యలు చేపడతామన్నారు. మేకవారిపల్లెలో భూఉపరితల జలాశయానికి అదనంగా పైపులైను , అలాగే డైరెక్టు పంపింగ్‌కు అనదంగా హెడ్‌డీపైపును ఏర్పాటు చేసి నీటి సమస్యను తీరుస్తామని ఆయన పేర్కొన్నారు.



నీటి కోసం తీవ్ర ఇక్కట్లు: తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితిని ఇంత వరకు చూడలేదు. రాత్రిం బవళ్లు మోటార్ల వద్ద కాపలా ఉన్నా సరిపడ నీరు దొరకడం గగనమైంది. – పుల్లయ్య, మేకవారిపల్లె, బి.కోడూరు మండలం



బోర్లు ఎండిపోయాయి: గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాం. బోర్లు ఎండిపోయాయి. చేతిపంపుల్లో చుక్కనీరు రాదు. వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లినా నీరు తెచ్చుకోవడం కష్టంగా మారింది. అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలి.   – చిన్నవీరయ్య, మేకవారిపల్లె, బి.కోడూరు మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top