ఈ నేరం మాది కాదు

divi leela madhava rao statement on ration rice Illegal transport

రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు మాధవరావు స్పష్టీకరణ

పెరవలి : రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసింది కాదని ఈ బియ్యం అంతా స్టాక్‌ పాయింట్ల నుంచే రవాణా జరుగుతుందని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఆరోపించారు. నల్లాకులవారిపాలెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం కొవ్వూరు డివిజన్‌ రేషన్‌ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్‌ దుకాణాలకు సరుకును పంపిణీ చేసే స్టాక్‌ పాయింట్లు 266 ఉన్నాయని వీటి ద్వారా ప్రతి నెలా 400 లారీల సరుకు పక్కదారి పడుతుందని తెలిపారు. సరుకును అక్రమంగా తరలించి ఆ నిందను రేషన్‌ డీలర్లపై నెడుతున్నారని ఆరోపించారు.

ఈ నెల నుంచి నేరుగా పాయింట్ల నుంచి వచ్చే సరుకును తూకం వేయకుండా ఇస్తే వాటిని తీసుకోకుండా వెనక్కి పంపించాలని తెలిపారు. రేషన్‌ బియ్యం బొక్కేదెవరో తెలియాలంటే స్టాక్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి నర్సింహరావు, చంటి అజేయరెడ్డి, నల్లాకుల వెంకటేశ్వరరావు, వీరబ్రహ్మం పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top