వైద్య శాఖలో జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగులకు గురువారం రాత్రి నిర్వహించిన బదిలీ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు,
విజయనగరం ఫోర్ట్: వైద్య శాఖలో జిల్లా స్థాయి కేడర్ ఉద్యోగులకు గురువారం రాత్రి నిర్వహించిన బదిలీ కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు తమను మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని కౌన్సెలింగ్ కమిటీ చైర్మన్ జెసీ–2 నాగేశ్వరరావు, కన్వీనర్ డీఎంహెచ్‌ఓ పద్మజను కోరారు. అయితే గిరిజన ప్రాంతాల్లో పనిచేయడానికి నియమితులైనవారిని అక్కడే వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేస్తాం తప్ప మైదాన ప్రాంతాలకు బదిలీ చేయలేమని స్పష్టం చేశారు.
అయితే మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ తమకు అనుమతిచ్చారని, కాబట్టి మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలని ఫార్మసిస్టులు, ల్యాబ్‌టెక్నీషియన్లు కౌన్సెలింగ్ గది ముందు బైఠాయించారు. అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని భీష్మించారు. అయినా కౌన్సెలింగ్ కమిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే... కౌన్సెలింగ్ పక్రియ కానిచ్చేశారు.
హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు పట్టించుకోలేదు
2011 నుంచి మేము గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నాం. ఆరేళ్లుగా అక్కడ విధులు నిర్వరిస్తున్నా... మమ్మల్ని మైదాన ప్రాంతాలకు బదిలీ చేయడంలేదు. దీనిపై డీఎంఅండ్‌హెచ్‌ఓను కోరితే హెల్త్ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆయన ఉత్తర్వులు ఇచ్చినా ఇక్కడి జేసీ–2, డీఎంఅండ్‌హెచ్‌ఓ చెల్లవని మొండికేస్తున్నారు. ఇదేం న్యాయం. – గిరిజన ప్రాంత ఉద్యోగులు